ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుసుమకుమార్! | kusuma kumar as congress candidate for khmaama loksabha consttituency| party| high| command| decide| check| mallu| bhatti| vikramarka
posted on Feb 27, 2024 5:16AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హల్చల్ చేసింది. అలాగే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సైతం పార్టీ గాలి బలంగా వీచేందుకు ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఆ క్రమంలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం చేపట్టింది. అందులోభాగంగా ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా జెట్టి కుసుమ కుమార్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో లోక్‌సభ సీట్లకు కాంగ్రెస్ లో ఎంత డిమాండ్ ఉన్నా.. వాటిలో ఖమ్మం లోక్‌సభ స్థానం సెపరేట్. అది చాలా హాట్ సీట్ అన్న సంగతి తెలిసిందే. ఈ స్థానం కోసం జిల్లాలోని కీలక నేతలు ఎవరికి వారు పోటీ పడి మరీ తమ వంతు ప్రయత్నాలు చేసుకొంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందినిని ఇక్కడ నుంచి ఎంపీగా బరిలో దింపేందుకు హస్తిన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇదే ఎంపీ టికెట్ ఇప్పించి.. గెలిపించుకోనేందుకు తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారని సమాచారం.
అలాంటి వేళ.. అదే జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు జెట్టి కుసుమ కుమార్ పేరును పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకుంటే… ఒక కుటుంబానికి ఒకే పదవి అనే ఓ చర్చ పార్టీలో సీరియస్‌గా నడుస్తోండగా.. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు.. రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రులగా కొనసాగుతున్నారు. అదీకాక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఖమ్మం జిల్లాలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో తమ అనుకూలురుకే టికెట్ కేటాయించేందుకు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్కతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అధిష్టానం వద్ద చక్రం తిప్పారని.. దీంతో ఈ సారి ఖమ్మం ఎంపీ టికెట్ మరోకరికి కేటాయించాలని.. అందులోభాగంగా జెట్టి కుసుమ కుమార్ పేరును పార్టీ అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇక జెట్టి కుసుమ కుమార్ విషయానికి గత 38 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉండడమే కాదు.. పార్టీలో వివిధ స్థాయిలో కీలకంగా పని చేశారు. ఇంకా చెప్పాలంటే.. పార్టీ ఒకానొక సమయంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా కాంగ్రెస్ ను వీడకుండా ఆ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. అలాగే ఖమ్మం లోక్‌సభ పరిధిలోని 7 స్థానాల్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేయడంలో జెట్టి కుసుమ కుమార్ హస్తం ఉందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఆయనకు ఖమ్మం లోక్ సభ స్థానంలో పోటీకి దింపాలని నిర్ణయించిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అదీకాక.. ఖమ్మం జిల్లాకు చెందిన జెట్టి కుసుమ కుమార్‌ది స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నివాసానికి నేరుగా వెళ్లి.. వారిని కలిసి మాట్లాడగల చొరవ ఆయన సొంతం. ఇక గతంలో ఇదే ఖమ్మం ఎంపీగా గెలిచిన రేణుకా చౌదరి, నామా నాగేశ్వరరావుల సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమ కుమార్ బరిలో దిగితే.. ఆయన విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ లో ఓ చర్చ ఊపందుకొంది.
ఇంకోవైపు పార్టీలో ఖమ్మం ఎంపీ సీటుకు తీవ్ర డిమాండ్ ఉన్న నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు రేణుకా చౌదరికే ఆ టికెట్ కేటాయిస్తారనే ఓ ప్రచారం రాజకీయ వర్గాలలో వాడి వేడిగా నడిచింది. అయితే పార్టీ అధిష్ఠానం ఆమెను రాజ్యసభకు పంపిచడంతో తమకు లైన్ క్లియర్ అయిందంటూ అటు మల్లు భట్టి విక్రమార్క, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబరాలు చేసుకొంటూ. ఎవరికి వారు.. తమకే ఖమ్మం ఎంపీ టికెట్ అంటూ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం జెట్టి కుసుమ కుమార్ వైపు మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.