ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో వైసీపీ ఫౌల్ గేమ్.. క్రికెటర్ హనుమ విహారి ఔట్ | ycp foul game with crickter hanuma vihary| politics| rule| aca| team| india| ashwin| support| babu
posted on Feb 27, 2024 10:46AM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల దాష్టికానికి నిర్వీర్యం కాని వ్యవస్థ లేదు. వేధింపులకు గురి కాని రంగం లేదు. రాష్ట్రంలో ఉండాలంటే వైసీపీ నేతల పెత్తనాన్ని అంగీకరించి తల వంచుకు బతకాల్సిందే అన్నట్లుగా ఆ పార్టీ నాయకుల తీరు ఉంది. పరిశ్రమలను తరిమేశారు. ఉద్యోగాలివ్వకుండా యువతను వలస బాట పట్టించేశారు. రైతులను వ్యవసాయానికి దూరం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో వైసీపీ దాష్టికానికి గురి కాని రంగం అంటూ ఉండదు. తాజాగా క్రీడా రంగంపై కూడా వైసీపీ తన పంజా విసిరింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్న వైసీపీ నాయకగణం.. తాజాగా దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన టాలెంటెడ్ క్రికెటర్ హనుమ విహారిని ఏపీ నుంచి తరిమేసింది. అందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతోంది. ఇంటర్నేషనల్ క్రికెటర్ హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు కెప్పెన్సీ నుంచి అవమానకరంగా తొలగించారు. ఆయనే రాజీనామా చేశారంటూ ప్రచారం చేశారు. వాస్తవమేమిటన్నది హనుమ విహారి స్వయంగా తన సామాజిక మాధ్యమం ఖాతాలో పోస్టు చేసే వరకూ వెలుగులోకి రాలేదు. తాజాగా హనుమ విహారి తాను ఇక ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడేది లేదంటూ చేసిన పోస్టుతో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ను వైసీపీ నేతల ఆటలు ఎలా సాగుతున్నాయో బయటపడింది.
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టులో 17వ ప్లేయర్ ను కెప్టెన్ హోదాలో మందలించిన హనుమ విహారిని అత్యంత అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తప్పించేశారు. ఎందుకంటే ఆ 17వ ప్లేయర్ వైసీపీకి చెందిన ఓ చిన్న నాయకుడి పుత్రరత్నం. ఆ వైసీపీ చోటా నేత తిరుమతి కార్పొరేటర్ నరసింహ. తన కుమారుడిని మందలిస్తాడా అన్న ఆగ్రహంతో సదరు కార్పొరేటర్ తన పలుకుబడిని ఉపయోగించి హనుమ విహారిని అత్యంత అవమానకరరీతిలో కెప్టెన్సీ పదవి నుంచి తొలగించేశారు. అంత పలుకుబడి ఓ కార్పొరేటర్ కు ఎక్కడిదంటే.. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమనకు సన్నిహితుడు. తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా భూమన తనయుడు రంగంలో ఉన్నారు. ఇది చాలదూ వైసీపీలో ఓ కార్పొరేటర్ స్థాయి వ్యక్తి మాట చెల్లుబాటు కావడానికి. భూమన ద్వారా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చి ఏపీ నుంచి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ ను రాష్ట్రం నుంచి తరిమేశారు. కెప్టెన్సీ నుంచి అవమానకరంగా తొలగించడంతో మనస్తాపానికి గురైన హనుమ విహారి ఇక ఏపీకి ఆడేది లేదని ప్రకటించారు.
ఈ రంజీ సీజన్ లో ఏపీ జట్టు బెంగాల్ తో తొలి మ్యాచ్ సందర్బంగా కెప్టెన్ హనుమ విహారి తన జట్టులో 17వ ప్లేయర్ అయిన కేఎన్ పృధ్వీరాజ్ ప్రవర్తన సరిగా లేదంటూ మందలించారు. ఇది జరిగిన వెంటనే.. అంటే ఆ మ్యాచ్ పూర్తి కాగానే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ హనుమ విహారిని కెప్టెన్ గా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా హనుమ విహారే కెప్టెన్సీకి రాజీనామా చేశారంటూ ఏకపక్షంగా ప్రకటన కూడా విడుదల చేసేసింది.
అయితే క్రీడా స్ఫూర్తి తెలిసిన క్రీడాకారుడిగా రంజీ సీజన్ మ్యాచ్ లు అయిపోయే వరకూ ఆగిన హనుమ విహారి ఆ తరువాత జరిగిన విషయాలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. తెగించేసిన వారిని ఎవరు మాత్రం ఏం చేయగలరు. అసలు క్రీడా రంగంపై వైసీపీ పెత్తనాన్ని ప్రశ్నించాలి. ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి అల్లుడు. మిగిలిన సభ్యులంతా ఆయన కనుసన్ననలలోనే మెలుగుతారు. పెత్తనం అంతా మనదేనన్న బరితెగింపుతోనే వైసీపీ ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడి కెరీర్ తో ఆటాడేసుకుంది. ఇంతకీ ఆ కార్పొరేటర్ పుత్ర రత్నం కేఎన్ పృధ్వీరాజ్ ఏకంగా ఏపీ రంజీ జట్టులోకి ఎలా వచ్చేశాడన్న అనుమానం ఎవరికీ రావడం లేదు. ఎందుకంటే అడ్డగొలు సిఫార్సులతో జట్టులో స్థానం సంపాదించిన అతడు ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినందుకు కెప్టెన్ మందలించారు. ఆ మందలింపే హనుమ విహారి ఏపీ జట్టుకు ఆడేదే లేదన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. ఇంత జరిగిన తరువాత కూడా పృధ్వీ హనుమ విహారిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఏం పీకలేవు అంటూ అనుచిత భాషను ఉపయోగిస్తూ పోస్టు పెట్టి మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారు.
దీంతో హనుమ విహారి ఓపెన్ అయ్యారు. జట్టు మొత్తం తననే కెప్టెన్ గా కొనసాగించాలన్న డిమాండ్ చేసిందనీ, వారంతా ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు లేఖ కూడా రాశారని పేర్కొంటూ ఆ లేఖను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతే కాదు.. ఆ తరువాత అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారుల నుంచి ఆంధ్ర జట్టు సపోర్ట్ స్టాఫ్‌కు ఫోన్స్ వచ్చాయని, వారందర్నీ తనకు వ్యతిరేకంగా మాట్లాడేలా ఒత్తిడి చేస్తున్నారని మరో పోస్ట్‌లో పేర్కొన్నాడు.
ఇప్పుడు హనుమ విహారి వ్యవహారం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. హనుమ విహారికి మద్దతుగా టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ ఈ విషయమై తన యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడమని ఆహ్వానించాడు. అందుకు హనుమ విహారి అంగీకరించాడు. టీమ్ ఇండియా క్రికెటర్లందరూ కూడా హనుమ విహారికి మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను బీసీసీఐ వివరణ కోరుతుందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఇక వైసీపీ దాష్టికానికి అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తొలగింపునకు గురైన హనుమ విహారికి మద్దతుగా చంద్రబాబు కూడా స్పందించారు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో రాజకీయ కుట్రలకు బాధితుడైన టీమిండియా క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తం మీద హనుమ విహారి విషయంలో వైసీపీ ఆడిన వికృత క్రీడకు వ్యతిరేకంగా క్రీడా రంగం నుంచి, రాజకీయ రంగం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బీసీసీఐ రంగంలోకి దిగితే ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ లో వైసీపీ పెత్తనానికి తెర పడటం ఖాయమని అంటున్నారు.
ఇంతకీ హనుమ విహారి భారత్ తరఫున 16 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు స్కోర్ చేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్ట్ లో హనుమ విహారి ఆడిన తీరు అద్భుతం. ఆ మ్యాచ్ లో హను మ విహారి ఆటతీరును ఎప్పటికీ మరచిపోలేం. గత ఏడేళ్లలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెప్టెన్ గా హనుమ విహారి ఐదు సార్లు జట్టును రంజీల్లో నాకౌట్ దశకు తీసుకువచ్చారు. అటువంటి గొప్ప క్రికెటర్ ను కేవలం ఒక కార్పొరేటర్ కుమారుడు చెప్పాడని అత్యంత అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తప్పించేసిందీ జగన్ రెడ్డి సర్కార్. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. క్రీడాకారులతో అత్యంత అవమానకర రీతిలో వ్యవహరిస్తూ.. రాష్ట్రాంలో ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాలను నిర్వహించి ఉపయోగమేమిటి జగన్ అని ప్రశ్రించారు.
ఆంధ్రా క్రికెట్ ను, జాతీయ క్రికెట్ ను మీరు అందించిన సేవలకు క్రికెట్ ను ప్రేమించే వారంతా హనుమ విహారికి అండగా ఉంటారని పవన్ ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. హనుమ విహారి మళ్లీ ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడతారనీ, రాష్ట్రంలో క్రీడాకారులను గౌరవించడం తోలిసిన ప్రభుత్వం రాబోతోందనీ పేర్కొన్నారు.