పార్టీల ఫేట్ మార్చేస్తున్న క్రాస్ ఓటింగ్.. ఇంతకీ బీజేపీది బలుపా.. వాపా? | cross voting in rajyasabha elections| bjp| strength
posted on Mar 1, 2024 10:28AM
తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్, బీజేపీలకు తలనొప్పిగా మారింది. అయితే ఈ క్రాస్ ఓటింగ్ వల్ల ఎక్కుల లబ్ధి పొందింది మాత్రం భారతీయ జనతాపార్టీయే అనడంలో సందేహం లేదు. మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు వరకూ బీజేపీకి ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ అన్న గుర్తింపు ఉండేది. పార్టీలు మారడం, ప్రభుత్వాలను కూల్చడానికి ఎమ్మెల్యేలను గంపగుత్తగా ఆకర్షించేందుకు వ్యూహాలు పన్నడం, ప్రలోభాలకు గురి చేయడం ఇవన్నీ కాంగ్రెస్ కల్చర్ అనీ, అయితే బీజేపీ అటువంటి వాటికి దూరంగా ఉండే విలువలు ఉన్న పార్టీగా బీజేపీకి ఒక ఇమేజ్ ఉండేది. క్రమశిక్షణ కలిగి, విలువలు పాటించే విషయంలో బీజేపీ ముందుంటుందన్న భావన జనబాహుల్యంలో కూడా ఉండేది. అయితే 2014 ఎన్నికలలో బీజేపీ విజయం సాధించి కేంద్రంలో అధాకరం చేపట్టిన తరువాత క్రమంగా ఆ పార్టీకి ఉన్న స్పెషల్ ఇమేజ్ కనుమరుగౌతూ వచ్చింది.
అధికారం, అందుకోసం ఏం చేసినా ఫరవాలేదన్న భావన ఇప్పుడు ఆ పార్టీలో నిలువెల్లా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అయితే అధికారం ఒక్కటే చాలదు, చట్టసభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీయే లక్ష్యం అంటోంది. అంతే కాదు.. దేశంలో ఇన్ని పార్టీలు ఎందుకు బీజేపీ ఒక్కటే చాలు అన్న భావన కూడా ఆ పార్టీ అగ్రనేతల్లో బలంగా వ్యక్తం అవుతోంది. కేంద్రంలో అధికారంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ అధికారాన్ని గుప్పెట ఉంచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బీజేపీ తరువాత అంతటి బలం, సంస్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్ ను తుడిచిపెట్టేయాలన్న లక్ష్యన్ని బాహాటంగానే ప్రకటించి అందుకు అనుగుణంగా రాజకీయ అడుగులు వేస్తున్నది. అసలిప్పుడు మోడీ అండ్ కో నినాదమే కాంగ్రెస్ ముక్త భారత్. అంటే ఆ పార్టీ లక్ష్యమేమిటో, ఉద్దేశమేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా కాసేపు పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే.. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ బెడదను బీజేపీ కూడా ఎదుర్కొన్నప్పటికీ, దాని వల్ల ఆ పార్టీకి ఏ మంత నష్టం వాటిల్లలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్ లో కోలుకోలేని దెబ్బ తగిలింది.
అసలింతకీ క్రాస్ ఓటింగ్ కు పాల్పడితే అనర్హత వేటు పడుతుందని తెలిసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుకు సాహసించడం వెనుక నిస్సందేహంగా బీజేపీ ప్రోత్సాహం ఉందని పరిశీలకులు అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ వారి క్రాస్ ఓటింగ్ కారణంగా రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది. దీంతో ఆ పార్టీకి రాజ్యసభలో మరెవరి తోడ్పాటూ లేకుండా తన మాట చెల్లించుకోవడానికి అవసరమైన మెజారిటీని నాలుగడుగుల దూరంలో నిలిచింది. అయితే ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీల్లో చాలా వరకూ.. బీజేపీకి పరోక్ష మద్దతుదారులుగానే ఉన్నాయి కనుక భవిష్యత్ లో సభలో మాట నెగ్గించుకోవడం, బిల్లులు ఆమోదింప చేసుకోవడంలో బీజేపీకి ఎటువంటి ఇబ్బందులు, అడ్డంకులు ఉండవని చెప్పొచ్చు. ఇక యూపీలో కూడా బీజేపీ ఇతర పార్టీల సభ్యుల క్రాస్ ఓటింగ్ వల్ల లబ్ధి పొందింది. అయితే కర్నాటకలో మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు.
మొత్తంగా 56 రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరిగితే బీజేపీ 30 గెలుచుకుని, రాజ్యసభ లో 97 సీట్ల తో పెద్ద పార్టీ గా నిలిచింది. నామినేటెడ్ సభ్యులతో కలిసి ఎన్డీయే బలం 117 కి చేరింది. ఖాళీ స్థానాలు వదిలేస్తే రాజ్యసభ బలం 240, అంటే 121 సాధారణ మెజార్టీ కి ఎన్డీయే కేవలం నాలుగు స్థానాల దూరంలో ఉంది. అదే మూడింట రెండోంతుల మెజారిటీకి 39 స్థానాలు తక్కువ. అయినా అదేమీ పెద్ద అవరోథం కాదు. ఎందుకంటే వైసీపీ, బీజేడీ , బీఎస్పీ, బీఆర్ఎస్, ఏడిఎంకే లు ఎన్డీయేకే మద్దతు పలుకుతున్నాయి. పలుకుతాయి. ఇలా చూసుకుంటే మరో పది మంది మద్దతు చూరగొంటే చాలు రాజ్యసభ లో ఎన్డీయేకు మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్నట్లే. సో ఇప్పుడు ఇక బీజేపీ దృష్టంతా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఒంటరిగానే సంపూర్ణ మెజారిటీ సాధించడంపై దృష్టి కేంద్రీకరించింది. ఈ సారి లోక్ సభ ఎన్నికలలో బీజేపీ ఒంటరిగానే 370 గెలవాలి, అదే ఎన్డీయే స్థానాల సంఖ్య 400దాటాలి అని మోడీ పిలుపు వెనుక అర్ధం, ఉద్దేశం, లక్ష్యం ఇదే. లోక్ సభలో మూడింట రెండోంతుల మెజారిటీ అంటే 362 స్థానాలు. ఆ బెంచ్ మార్క్ ను దృష్టిలో ఉంచుకునే మోడీ బీజేపీ గెలవాల్సిన స్థానాల సంఖ్య 370గా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ లక్ష్యాన్ని సాధిస్తే బిజెపికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చేస్తుంది. అంటే ఇక ఇష్టారాజ్యంగా రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకోవడానికి మోడీ అండ్ కోకు ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.
విపక్షాలు కూడా ఇదే భయంతో మోడీ హఠావో అంటూ జాతీయ స్థాయిలో ఐక్య కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో సారి మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారన్న ఆందోళనలో బీజేపీయేతర పార్టీలున్నాయి. ఇప్పటికే 2024లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తే 2029 నుంచి దేశంలో జమిలి ఎన్నికలే జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతోంది. అయితే క్రాస్ ఓటింగ్ తో రాజ్యసభలో బీజేపీకికి పెరిగిన సంఖ్య బలుపా, వాపా అంటూ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.