Leading News Portal in Telugu

రుషికొండ‌లో క్షుద్ర పూజ‌లు?.. నరబలి? | occult worship rishikonda| narabali| illegal| Structures| secret| opening| minister


posted on Mar 1, 2024 8:08AM

రుషికొండ‌లో క్షుద్ర పూజ‌లు జ‌రిగాయా? అందుకే మీడియాను సైతం అనుమ‌తించ‌లేదా? వంద‌ల కోట్ల‌ ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాకుండా మంత్రి రోజా, వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు అంత ర‌హ‌స్యంగా ఎందుకు ప్రారంభించాల్సి వ‌చ్చింది? రుషికొండ‌పై నిర్మించిన భ‌వ‌నాలు టూరిజంకోసం వినియోగించేందుకా? ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లు సీఎం క్యాంప్ కార్యాలయానికా? రుషి కొండ‌పై అస‌లేం జ‌రుగుతోంది..? ప్ర‌స్తుతం ఈ అంశాల‌పై ఏపీ ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. మ‌రి కొద్ది రోజుల్లో ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల ముందు హ‌డావిడిగా ఈ భ‌వ‌నాల‌ను మంత్రి రోజా ప్రారంభించారు. అందులోనూ స్వ‌రూపానంద స్వామీజీ కూడా ఉన్నారు. దీంతో అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అయితే రుషికొండ భ‌వ‌నాల్లో న‌ర‌బ‌లి జ‌రిగింద‌ని, అందుకే స్వ‌రూపానంద వెళ్లారంటూ ఆరోపించారు. పాల్ వ్యాఖ్య‌ల‌కు ఎలాంటి ఆధారాలు లేక‌పోయినా.. ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను ర‌హ‌స్యంగా ప్రారంభించ‌డంపై ఏపీ ప్ర‌జ‌ల్లో ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

విశాఖ‌లో ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌. ఈ కొండ‌ను అక్ర‌మంగా త‌వ్వేసిన తీరుపై మొద‌టి నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌తిప‌క్షాల‌తోపాటు విశాఖ ప్ర‌జ‌లు సైతం రుషికొండ‌పై త‌వ్వ‌కాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. రుషికొండ‌పై అనుమ‌తులు ఒక‌లా.. ప‌నులు మ‌రోలా జ‌ర‌గ‌డం వివాదాస్ప‌దంగా మారింది. రుషికొండ‌పై రిసార్ట్స్ పున‌రుద్ద‌ర‌ణ‌కు ఏపీటీడీసీ కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ నుంచి 9.88 ఎక‌రాల‌కు సీఆర్‌జ‌డ్ అనుమ‌తి తీసుకుంది. జీవీఎంసీ నుంచి మాత్రం భ‌వ‌న నిర్మాణాల ప్లాన్‌కోసం 65 ఎక‌రాల‌కు అనుమ‌తి కోర‌డం అప్ప‌ట్లో వివాదాస్ప‌దంగా మారింది. జీవీఎంసీకీ స‌మ‌ర్పించిన ప్లాన్‌లోని భ‌వ‌నాల‌కు సంబంధించిన ఆకృతులు ప‌ర్యాట‌క వ‌స‌తుల‌కు వీలుగా లేవు. దాదాపు అన్ని నిర్మాణాల ఆకృతులు కార్యాల‌యాల‌ను పోలి క‌నిపించ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి తోడు మొద‌టి నుంచి ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు రుషికొండ‌పై త‌వ్వ‌కాల‌ను త‌ప్పుబ‌డుతూ వ‌చ్చారు. హైకోర్టు, జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ (ఎన్‌జీటీ)లో కేసులు దాఖ‌ల‌య్యాయి. హైకోర్టు ఆదేశాల మేర‌కు అయిదుగురు స‌భ్యుల నిపుణుల క‌మిటీ రుషికొండ మీద స‌ర్వే చేప‌ట్టి ప‌లు ఉల్లంఘ‌న‌లు జ‌రిగాయ‌ని తేల్చింది. ఆ త‌రువాత హైకోర్టు కేంద్ర అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ ను ప‌రిశీల‌న‌కు ఆదేశించింది. ఎంవోఈఎఫ్ సైతం నిపుణుల క‌మిటీతో ప‌రిశీలించింది. దీనికి సంబంధించి తుది తీర్పు త్వ‌ర‌లో రానుంది. తీర్పు రాక‌ముందే.. ఈ భ‌వ‌నాలు ప్రారంభించ‌డం వివాదాస్ప‌దంగా మారింది. కోర్టు ఈ అంశాన్ని సిరీయ‌స్ గా తీసుకుంటే రోజాకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే వాద‌న ఉంది.

రుషికొండ వద్ద పలు భవనాలను ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ వెళ్లారు. అయితే  పోలీసులు ఆయ‌న్ను అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.. రుషికొండ లోపల ఏం జరుగుతుందో తెలియాలి. ప్రభుత్వ కార్యక్రమానికి ఎందుకు అంత రహస్యం అని ప్రశ్నించారు. శారదా పీఠం స్వామిని పిలిచారు. లోపల నరబలి ఏమయినా జరిగిందేమో అని అనుమానం ఉంది. ఇదే స్వ‌రూపానంద తెలంగాణ‌లో కేసీఆర్ కోసం న‌ర‌బ‌లి ఇచ్చారని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు జ‌గ‌న్ కోసం అదే చేస్తున్నారని అనుమానంగా ఉంది. న‌ ర‌బ‌లి ఇచ్చాడు కాబ‌ట్టే ఎవ‌ర్నీ రానివ్వ‌డం లేదంటూ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రుషికొండ అక్రమాలు, ప్రారంభోత్సవాలపై కోర్టుకు వెళ్లి పిల్ వేస్తానని కేఏపాల్ స్పష్టం చేశారు. అయితే, భ‌వ‌నాల ప్రారంభం త‌రువాత టూరిజం మంత్రి రోజా మాట్లాడుతూ.. రుషికొండ‌లో హ‌రిత రిసార్ట్స్ పాత‌వి ఉండేవి.. వాటి స్థానంలో అత్యంత ఆధునిక ప‌ద్ద‌తుల్లో ఏడు బిల్డింగ్ లు నిర్మాణం చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. టూరిజం కోసం అన్ని అనుమతులూ తీసుకొని వాటిని నిర్మాణం చేయ‌టం జ‌రిగింది. విశాఖ నుంచి  పాల‌న ప్రారంభ‌మైతే సీఎం జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యం ఎక్క‌డ నుంచి అయితే బాగుంటుంద‌ని త్రీమెన్ క‌మిటీ ప‌లు ప్రాంతాల‌ను చూసింద‌ని, రుషికొండను క్యాంప్ కార్యాల‌యంగా చేసుకొని పాల‌న సాగిస్తే బాగుంటుంద‌ని చెప్ప‌డం జ‌రిగింద‌ని రోజా తెలిపారు. అయితే, అది సీఎం జ‌గ‌న్ ఇష్ట‌మ‌ని, సీఎం క్యాంప్ కార్యాల‌యంగా అది వినియోగించుకోక‌పోతే టూరిజం భ‌వ‌నాలుగా కొన‌సాగుతాయ‌ని రోజా చెప్పారు. మొత్తానికి జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యం కోస‌మే ఈ భ‌వ‌నాలు నిర్మాణం చేసిన‌ట్లు రోజా చెప్ప‌క‌నే చెప్పారు.

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ హ‌డావుడిగా రుషికొండ‌పై భ‌వ‌నాల‌ను ర‌హ‌స్యంగా ప్రారంభించ‌డం వెనుక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పెద్ద ప్లాన్ ఉంద‌ని తెలుస్తోంది. అమ‌రావ‌తిని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తాన‌ని, అందులో విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా ఉంటుంద‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌స్తున్నారు. మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్ ను ఏపీ ప్ర‌జ‌లు తీవ్రంగా వ్యతిరేకించారు.   అయినా.. జ‌గ‌న్ త‌న మొండి వైఖ‌రితో విశాఖ నుంచి పాల‌న సాగించేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌చ్చారు. కానీ కోర్టులు మొట్టికాయ‌లు వేస్తుండ‌టంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేసింది. తాజాగా కోర్టుల‌ను ధిక్క‌రించేలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్నద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రుషికొండ‌పై నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా సుమారు 500 కోట్ల‌తో నిర్మాణం చేసిన భ‌వ‌నాలను మంత్రి రోజా, వైసీపీ నేత‌లు మీడియాను సైతం అనుమ‌తించ‌కుండా ప్రారంభించారు. రోజా టూరిజం మంత్రి కాబ‌ట్టి ఆమె ప్రారంభిస్తే అవి టూరిజం భ‌వ‌నాలేన‌ని ప్ర‌జ‌ల‌ను నమ్మించవచ్చని జగన్ అండ్ కో వ్యూహాత్మకంగా వీటిని ఆమె చేత ప్రారంభింపచేశారు. అయితే ఆ వ్యూహం వికటించింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వారంలో మూడు రోజులు ఈ భ‌వ‌నాల్లో ఉంటార‌ని తెలుస్తోంది. త‌ద్వారా విశాఖ నుంచి పాల‌న చేస్తాన‌న్న త‌న మాట‌ను నెగ్గించుకునేందుకు జ‌గ‌న్ ఇలాంటి ఎత్తుగ‌డ వేశార‌ని పరిశీలకులు అంటున్నారు.