Leading News Portal in Telugu

ముసుగులు తీసేసిన ముద్రగడ, చేగొండి! | mudragada chegondi remove masks| ycp| join| kapu| welfare| drama| hurdle| tdp| janasena| allaiance| strategy


posted on Mar 2, 2024 10:45AM

మాటకు ముందూ మాటకు తరువాత నా కాపు జాతి అనే ముద్రగడ పద్మనాభం, కాపు జాతి సంక్షేమమే తన లక్ష్యం అంటూ అడిగినా అడగకపోయినా సలహాలూ, సూచనలూ అంటూ పవన్ కల్యాణ్ కు బహిరంగ లేఖలు రాస్తూ శ్రేయోభిలాషినని చెప్పుకునే  చేగొండి హరిరామజోగయ్యలు ఇప్పుడు తమ ముసుగులు తీసేశారు. కాపు సామాజికవర్గ శ్రేయస్సు కంటే తమ రాజకీయ స్వార్థమే ముఖ్యమని తేటతెల్లం చేశారు.

పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రకటించిన క్షణం నుంచీ వీరురువురూ గతంలో ఏం చేసినా, ఎలా వ్యవహరించినా, రాష్ట్రంలోని కాపులందరి తరఫునా వకాల్తా పుచ్చుకుని మరీ హడావుడి చేశారు. పొత్తు పొసగకుండా పవన్ కల్యాణ్ వెనక్కు లాగేందుకు చేయగలిగినంతా చేశారు. అది కదరకపోయే సరికి సీట్ల సర్దుబాటులో బెట్టు చేయాలంటూ సూచనలు చేశారు. బహిరంగ లేఖలు రాశారు. చివరకు తమ మాట పవన్ వద్ద చెల్లుబాటు కాదని తేలిపోయిన తరువాత అప్పటి వరకూ వేసుకున్న కాపు ముసుగును తీసేసి.. వైసీపీ గూటికి చేరిపోయారు.  తెలుగుదేశం, జనసేన పొత్తు పొసగకుండా, ఒక వేళ పొత్తు పొసగినా సరే సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీలకూ సమన్వయం కుదరకుండా  ఇరువురు నేతలూ పడిన తాపత్రేయం, ఆత్రం అంతా ఇంతా కాదు. చివరికి తెలుగుదేశం, జనసేన తాడేపల్లి గూడం సభలో తమ రెండు పార్టీల మధ్యా చక్కటి సమన్వయం ఉందనీ, బలాబలాలూ, గెలుపు అవకాశాలూ అన్నీ బేరీజు వేసుకునే సీట్ల సర్దుబాటు చేసుకున్నామని సందేహాలకు అతీతంగా స్పష్టం చేసేయడంతో  తమ అసలు రూపు బయటపెట్టేయడానికి క్షణం ఆలస్యం చేయలేదు.

చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీ గూటికి చేరిపోయి.. ఆ పార్టీ నుంచి పాలకొల్లు టికెట్ దాదాపు ఖరారు చేసుకున్నారు. మరో వైపు ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. ఆయన కుటుంబం నుంచి ఎవరో ఒకరు పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇంత కాలం ఆ ఇరువురు నేతలూ పవన్ కల్యాణ్ కు శ్రేయోభిలాషులమంటూ బిల్డప్ ఇస్తూ చేసిన తతంగం అంతా వైసీపీ హైకమాండ్… తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లోనేనని అందరికీ అవగతమైపోయింది.  హరిరామ జోగయ్య గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విషయంలో కూడా తనదైన శల్యసారథ్యం చేసి కొంప ముంచారు అది వేరే సంగతి. ఆయనకు కాపు సామాజిక వర్గానికి పెద్దగా, ఆ సామాజికవర్గ సంక్షేమానికి పాటుపడే వ్యక్తిగా తనకు తాను ప్రకటించేసుకుని పబ్బం గడుపుకోవడం అలవాటేనని ఆయనను తెలిసిన వారు ఎప్పటి నుంచో చెబుతున్నారు. దాంతో తెలుగుదేశం, జనసేన పొత్తుల విషయంలో ఆయన చేసిన సూచనలూ, ఇచ్చిన సలహాలను ఆ సామాజికవర్గానికి చెందిన వారెవరూ పెద్దగా పట్టించుకోలేదు. వయస్సుకు, సీనియారిటీకి మాత్రమే గౌరవం ఇస్తున్నట్లు పవన్ మొదట్లోనే ప్రకటించి, ఆయనను పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు. 

కానీ ముద్రగడ విషయం అలా కాదు.  ముద్రగడ తొలి నుంచీ తెలుగుదేశం, జనసేన పొత్తును వ్యతిరేకిస్తూనే వచ్చారు. అందులో ఆయన ఎటువంటి దాపరికం లేకుండానే వ్యవహరించారు. కాపు రిజర్వేషన్లు కుదిరే పని కాదని జగన్ సీఎం హోదాలో కుండబద్దలు కొట్టేసినా ఆయన కిమ్మనలేదు. పైగా జగన్ పార్టీకి గట్టి మద్దతుదారుగా తనను తాను ప్రకటించుకున్నారు కూడా.  కాపుల మద్దతు జనసేనకు దక్కకుండా  అడ్డుకోవడానికి వైసీపీ ముద్రగడను తొలి నుంచీ పావులాగా వాడుకుంది.  చాలాకాలంగా సీరియస్ నేతగానే  కాపులలో బలమైన ప్రభావం చూపగలిగిన నేతగా ముద్ర ఉన్న ముద్రగడ జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై సవాల్ చేసిన సమయంలో తాను కాపు సామాజిక వర్గ శ్రేయస్సు కంటే జగన్  పక్షపాతిగా ఉండడానికి ఇష్టపడతానని చెప్పకనే చెప్పేశారు. అప్పట్లో   ద్వారంపూడికి మద్దతుగా పవన్ కల్యాణ్‌పై విమర్శలకు దిగారు.  గతంలో కాపు రిజర్వేషన్ కోసం ఉవ్వెత్తున జరిగిన ఉద్యమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది ద్వారంపూడేననీ, ఆయన ఖర్చుతోనే నాడు కాపు ఉద్యమ కారులకు ఉప్మా పెట్టాననీ ముద్రగడ రాసిన లేకపై కాపు సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఇవిగో నీ ఉప్మా డబ్బులు అంటూ ఆయనకు పెద్ద ఎత్తున మనీ ఆర్డర్లు పంపించిన సంగతి  కూడా తెలిసిందే. దీంతో బాహాటంగా జనసేనను వ్యతిరేకిస్తూ, జగన్ తో అంటకాగితే జనం నమ్మరని గ్రహించి అప్పటికి నెమ్మదించిన ముద్రగడ ఆ తరువాత జనసేన వైపే తన మొగ్గు అంటూ ఫీలర్లు పంపారు. జనసేన నేతలు కూడా ముద్రగడ పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉండడాన్ని స్వాగతించారు.   కానీ ఎందుకో పవన్ కల్యాణ్ ఆయనను నమ్మలేదు. ఎందుకు నమ్మలేదన్న విషయం ఇప్పుడు తేటతెల్లమైంది. పవన్ తనకు సలహాలూ, సూచనలూ అక్కర్లేదనీ, తనతో కలిసి నడిచే వారే తన వారనీ కుండబద్దలు కొట్టేయడంతో  ఇక ముసుగులతో పని లేదని ముసుగుతొలగించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జనసేనలో చేరి ఆ పార్టీనీ, పవన్ కల్యాణ్ ను డీఫేమ్ చేయాలన్న వ్యూహం పురిట్లోనే సంధి కొట్టడం వల్లే   ముద్రగడ ముసుగు తీసేసి జగన్ పార్టీ గూటికి చేరిపోయారనీ, ఇప్పుడు పిఠాపురం నుంచి ఏకంగా పవన్ పైనే పోటీ చేయడానికి రెడీ అవుతున్నారనీ పరిశీలకులు అంటున్నారు.   అందుకే ఇప్పటికే పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా ఖరారైన వంగా గీతను జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని సర్ది చెప్పారని అంటున్నారు. అంతే కాకుండా ఒక వేళ పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే.. తాను ఆయనపై పోటీ చేసి గెలిచే అవకాశం లేదని వంగా గీత కూడా చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ముసుగులు తీసేసిన కాపు నేతలను ఆ సామాజికవర్గం నమ్మే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.