తండ్రీ కొడుకులు చేతులెత్తేశారా? బీఆర్ఎస్ వలసలకు ఇక అడ్డేలేదా? | kcr and ktr hands up| lost| grip| brs| leaders| cadre| leaving
posted on Mar 4, 2024 10:20AM
గండి పడి వరద నీరు ఊళ్లకు ఊళ్లను ముంచేసినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసల వరద కొనసాగుతోంది. పార్టీ అస్థిత్వానికే గండి పడిందా అంటూ బీఆర్ఎస్ శ్రేణులే చర్చించుకునేలా పరిస్థితి మారిపోయింది. గండి పూడ్చడానికి బదులు వలసల ప్రవాహాన్ని పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అలా చూస్తూ ఊరుకోవడాన్ని చూస్తుంటే తండ్రీ కొడుకులిద్దరూ చేతులెత్తేశారా అని పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ రెండు సందర్భాలలోనూ కూడా బీఆర్ఎస్ లోకి వలసలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఏకంగా శాసనసభా పక్షాలనే విలీనం చేసుకున్న చరిత్ర ఆ పార్టీది. కానీ 2023 ఎన్నికల తరువాత ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. అధినేత, కార్యనిర్వాహక అధ్యక్షుడు చెప్పినా కూడా ఆ పార్టీ నేతలే కాదు, క్యాడర్ కూడా ఖాతరు చేయని పరిస్థితి కనిపిస్తోంది. అసలు కేసీఆర్ నాయకత్వంపై ధిక్కారం పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మార్చిన నాడే మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక 2023 ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత పార్టీపై కేసీఆర్, కేటీఆర్ పూర్తిగా పట్టు కోల్పోయారని అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కళకళలాడుతూ ఉన్న తెలంగాణ భవన్ ఇప్పుడు వెలవెలబోతున్నది. నిన్న మొన్నటి వరకూ చేరికలతో కిటకిటలాడిన తెలంగాణ భవన్ ఇప్పుడు వలసన కారణంగా బోసిపోయి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు పార్టీ రెండవ శ్రేణి నాయకత్వం కూడా ఏ పార్టీలో అవకాశం దొరికితే ఆ పార్టీలోకి జంప్ కొట్టేయడానికి రెడీగా ఉన్నారు.
ఈ విషయంలో వారేమీ దాపరికం ప్రదర్శించడం లేదు.. బాహాటంగానే పార్టీ పట్ల తమ విముఖతను చాటుతున్నారు. క్యాడర్ పరిస్థితీ అలాగే కనిపిస్తోంది. మొదట్లో వలసలను ఆపడానికి ఏదో ఒక మేరకు ప్రయత్నించిన కేసీఆర్, కేటీఆర్ లు ఇప్పడు తమ ప్రయత్నాలు, బుజ్జగింపులు ఫలించే పరిస్థితి లేదని అర్ధం చేసుకుని మౌనంగా జరుగుతున్నది చూస్తూ ఉండిపోతున్నారు.
ఓటమి తరువాత కూడా నెపం సిట్టింగుల మీదే నెట్టేసి.. వారి పట్ల ప్రజలలో ఉన్న అసంతృప్తే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి కారణమంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్, కేటీఆర్ లకు ఇప్పుడు తత్వం బోధపడి బొమ్మ కనిపిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. అసంతృప్తి కేవలం సిట్టింగుల మీదే కాదనీ, సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి, అహకర పూరిత వైఖరి పైన కూడానని వారికి అర్థమైనట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే వచ్చే లోక్ సభ ఎన్నికలలో పోటీకి టికెట్ ఇస్తామన్నా పోటీ చేయలేం బాబోయ్ అని పారిపోయే వారి సంఖ్యే ఎక్కువ కనిపిస్తున్నదని అంటున్నారు.
లీడర్లు పోయినా క్యాడర్ ను కాపాడుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు గంభీరంగా చెబుతున్నప్పటికీ, క్యాడర్ లో పార్టీ పట్ల అసంతృప్తిని గమనించే లీడర్లు పక్క చూపులు చూస్తున్నారని అంటున్నారు. ఇందుకు ఉదాహరణ పార్టీ నుంచి వలసలలో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ అధికంగా ఉండడాన్ని చూపుతున్నారు. ఇక బీఆర్ఎస్ ను వీడి వచ్చిన నేతలకు బీజేపీ లోక్ సభ టికెట్లు ఇవ్వడం చూస్తుంటే ప్రజల అసంతృప్తి బీఆర్ఎస్ అధినాయకత్వం మీదా, సిట్టింగుల మీదా అన్నది స్పష్టంగా అవగతమౌతోందని అంటున్నారు.