ఆ ఆశ కూడా పాయె.. దొడ్దిదారిన విమలారెడ్డి పరార్! | vimalareddy ran away from back door| jagan| hopes| evaporate| kakinada| pasters
posted on Mar 5, 2024 8:08AM
నూరు తప్పులు చేసిన శిశుపాలుడి తలను సుదర్శన చక్రంతో శ్రీకృష్ణుడు ఎలా ఖండించాడో.. ఐదేళ్ల పాలనలో వెయ్యికిపైగా తప్పులు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓటు ద్వారా తరిమికొట్టేందుకు ఏపీ ప్రజలు అలాగే సన్నద్ధమవుతున్నారు. ఐదేళ్ల కాలంలో జగన్ కక్షపూరిత రాజకీయం పరాకాష్టకు చేరుకుంది. తప్పు మీద తప్పుచేస్తూ ప్రజలను ఇబ్బందులు పాలుచేయడం రివాజుగా మారిపోయింది. ఆ తప్పుల ఫలితం ఎన్నికలలో అనుభవించక తప్పదని ఖరారైపోయింది.
ఎన్నికల ముంగిట జగన్ పతనం ప్రారంభమైంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏకం కావడం, ప్రజలు సైతం జగన్ పై పోరాటం చేసేందుకు సిద్ధమవ్వడంతో తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతోంది. ప్రజాక్షేత్రంలో వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో జగన్ ప్రలోభాల పర్వానికి తెరలేపారు. నియోజకవర్గాల వారిగా ప్రజలకు తాయిళాలు అందించేందుకు జగన్ అండ్ కో సన్నద్ధమవుతోంది. కులాలు, మతాల వారిగా విభజించి తాయిళాలు అందించేందుకు ఓ యాక్షన్ ప్లాన్ ను జగన్ కోటరీ సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో విమలారెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన వారిలో క్రిస్టియన్లు కూడా ఉన్నారు. ఏపీలో దాదాపు అన్ని గ్రామాల్లో వీరి ఓటు బ్యాంకు ఉంది. స్వతహాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం క్రిస్టియన్లు కావడంతో ఆ మతానికి చెందిన ఓట్లలో మెజార్టీ ఓట్లు గత ఎన్నికల్లో వైసీపీకి బదిలీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో గంపగుత్తగా క్రిస్టియన్లు వైసీపీకి మద్దతుగా నిలిచారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్. ఆయన ఏపీ వ్యాప్తంగా పర్యటించి క్రిస్టియన్లను వైసీపీవైపు మళ్లించడంలో సఫలమయ్యాడు. క్రిస్టియన్లు అంటే కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలే కాదు.. బీసీలు, ఓసీల్లోని కమ్మ, కాపు, రెడ్డి కులస్థులు కూడా అధికంగానే ఉన్నారు. కులంతో సంబంధం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనేకారణంతో మెజార్టీ శాతం క్రిస్టియన్లు చంద్రబాబును దూరంపెట్టి జగన్ వైపుకు వెళ్లిపోయారు. అయితే, ఇదంతా 2019 ఎన్నికల సంగతి. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో క్రిస్టియన్లు గతంలోలా జగన్ కు మద్దతు పలికే పరిస్థితి లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తనకు మద్దతుగా నిలిచిన క్రిస్టియన్లను వారు ఆశించిన స్థాయిలో దగ్గరకు తీయలేదని గుర్రుగా ఉన్నారు. దీనికితోడు జగన్ మోహన్ రెడ్డికి ఆయన సోదరి వైఎస్ షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ దూరమయ్యారు.
వైఎస్ కుటుంబంలో జరిగిన అంతర్గత యుద్ధంలో భాగంగా వైఎస్ షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ జగన్ మోహన్ రెడ్డిని పూర్తిగా వ్యతిరేకించి బయటకు వచ్చారు. ఇటీవల షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీనికితోడు బ్రదర్ అనిల్ కుమార్ తన పరిధిలో క్రిస్టియన్లను కాంగ్రెస్ వైపు మళ్లించి జగన్ ను దెబ్బతీసేందుకు సిద్ధమయ్యారు. క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమైతే ఓటమి ఖాయమని భావించిన జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా తన అత్త విమలారెడ్డిని రంగంలోకి దింపారు. విమలారెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరి. జగన్ సూచనతో వైసీపీ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ఆమె బైబిల్ పట్టుకొని జిల్లాల్లో చర్చి ఫాదర్ల మీటింగ్ లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కాకినాడ పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్ లో సేవకుల సదస్సు పేరుతో కాకినాడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చిల ఫాదర్లు హాజరు కావాలని ఆహ్వానం పంపించారు. విమలారెడ్డి అంటే వచ్చేందుకు చాలామంది ఫాదర్లు ఆసక్తి చూపకపోవటంతో.. వారికి డబ్బులు ఇస్తామని చెప్పి పిలిపించారు.
కాకినాడలో నిర్వహించిన సేవకుల సదస్సులో దాదాపు రెండువేల మంది ఫాదర్లు పాల్గొన్నారు. హాల్‌లోకి వెళ్లేముందు వారికి ట్యాగ్ లు ఇచ్చి లోపలికి పంపించారు. సదస్సు అయినపోయిన తరువాత వెళ్లేటప్పుడు ఆ ట్యాగ్ తీసుకొని రూ. వెయ్యి ఇచ్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేశారు. అయితే, వైసీపీ క్రైస్తవ సెల్ విభాగం ఊహించినదానికంటే అధిక సంఖ్యలో ఫాస్టర్లు, క్రైస్తవుల్లో పలు విభాగాలకు చెందిన వారు సదస్సుకు వచ్చారు. సదస్సు పూర్తయిన తరువాత నిర్వాహకులు ఇచ్చిన ట్యాగ్ లు తీసుకొని అప్పటికే కవర్లలో సిద్ధంగా ఉంచిన నగదును వారికి అందజేశారు. ముందుగా వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి కవర్ లో కేవలం రూ.500 మాత్రమే ఇవ్వడంతో పలువురు ఫాదర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ విషయం గమనించిన విమలారెడ్డి ఫంక్షన్ హాల్ వెనుకభాగంలో సిద్ధంగా ఉంచిన కారులో వెళ్లిపోయారు.
దీంతో పలువురు ఫాస్టర్లు ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవకుల సదస్సు పేరుతో ప్రార్థనలు చేసి మళ్లీ జగన్ పార్టీకే ఓటు వేయాలని కొందరిచేత విమలారెడ్డి బైబిల్ పై ప్రమాణం సైతం చేయించుకున్నట్లు పలువురు పాదర్లు పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన ఈ వ్యవహారాన్ని పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంలో అవి వెంటనే వైరల్ అయ్యాయి. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వేస్తున్న ఒక్కో అడుగు విఫలం అవుతుండటంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు.