posted on Mar 6, 2024 11:59AM
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దొంగ దొంగ సినిమాలోని మాస్ సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కొంచెం నీరు కొంచెం నిప్పు మాదిరిగా తయారయ్యింది హైద్రాబాద్ కమలనాథుల్లో. ప్రముఖ సామాజిక కార్యకర్త, సనాతన సాంప్రదాయాన్ని ప్రమోట్ చేస్తున్న కొంపల్లి మాధవిలతకు ఏకంగా హాట్ సీట్ హైద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానిక నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. బిజెపిలో అధికార ప్రతినిధి హోదాలో ఉన్న నడింపల్లి యమునాపాఠక్ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ హఠాత్తుగా మాధవిలత ఈ సీటును ఎగరేసుకు పోవడం పార్టీలో కొంత అసంతృప్తి మాత్రం కొంత వరకు ఉంది. మాధవిలత కనీసం పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. అయినా పార్టీ అధిష్టానం మాధవిలతకు టికెట్ ఇవ్వడంతో హైద్రాబాద్ నుంచి హిందుత్వవాదాన్ని బలపరిచే గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా అధిష్టానాన్ని ఏకి పారేశారు. హైద్రాబాద్లో మగాడు ఎవ్వరూ దొరకలేదా? అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది నానుడి . కానీ హైదరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి విషయంలో ఈ నానుడి సరిగ్గా సరిపోతుంది. మాధవిలత ఇంట గెలవకుండానే రచ్చ గెలుస్తా అని బయలు దేరారు. 1984 లో సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ ఇండిపెండెంట్ గా గెలుపొందారు ఆ తర్వాత ఆయన మజ్లిస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అప్పట్నుంచి మజ్లిస్ పార్టీ హైదరాబాద్ సీటును కైవసం చేసుకుంటుంది. సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ సీటును వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ ఎంపీ సీటుకు ముక్కోణపు పోటీ ఉంది. మజ్లిస్ పార్టీ నుంచి దివంగత యాకుత్ పురా ఎమ్మెల్యే మస్కతీ కుమారుడు అలీబిన్ మస్కతిని కాంగ్రెస్ పార్టీ రంగంలో దించబోతుంది. అలీ బిన్ మస్కతి టిడిపి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి అలీబిన్ మస్కతీని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు. ఈయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మాధవిలత గెలుపు సునాయసమౌతుంది. ఎందుకంటే ముస్లిం వోట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పెరిగాయి. పాత బస్తీలో కూడా కాంగ్రెస్ పార్టీ కి ఆదరణ పెరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు ఒక్కోటి అమలవుతున్నాయి. మైనార్టీ వోటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగానే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో విభేధించడంతో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. భాగ్యలక్ష్మి టెంపుల్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓవైసీ సోదరులను కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు జైల్లో పెట్టడమే దీనికి ప్రధాన కారణం. రాజకీయ కారణాలతో మజ్లిస్ కాంగ్రెస్ పార్టీతో విభేధించి బిఆర్ఎస్ కు దగ్గరయ్యింది. బిజెపి బీ టీం మజ్లిస్, బిఆర్ఎస్ అని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ప్రచారం చేసింది. దీంతో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. అదే టెంపో ప్రస్తుతం కొనసాగుతోంది. మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది. నా జోలికి వస్తే మస్కతీ వ్యాపార రంగాన్ని దెబ్బతీస్తానని అసదుద్దీన్ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ముస్లింల ప్రయోజనాలు దెబ్బతీస్తే ప్రొడక్ట్ చెక్నా చూర్ కరూంగా మస్కతీ ప్రొడక్ట్ ను ముక్కలు ముక్కలు చేస్తానన్నారు. మస్కతీ డైరీ వ్యాపారం పాతబస్తీలో పాతుకుపోయింది. ఇప్పుడు అదే వ్యాపారాన్ని దెబ్బతీస్తానన్నారు ఓవైసీ. కాబట్టి ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటి నెలకొంది.