posted on Mar 6, 2024 8:26AM
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో సారి అధికారాన్ని అందుకోవాలని తహతహలాడుతున్న వైసీపీ అధినేత, సీఎం జగన్ కు చెక్ పెట్టేందుకు వైసీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులోభాగంగా అభ్యర్థుల ఎంపికలో ఆయన ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
ఆ క్రమంలో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి బైరెడ్డి శబరిని బరిలో దింపనున్నారంటూ.. ఆ జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దాంతో నంద్యాలలో సోమవారం రాత్రి శబరి అనుచరులు బాణ సంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే బైరెడ్డి శబరి.. ఎవరో కాదు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె. ఆమె ప్రస్తుతం నంద్యాల బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
కానీ శబరితోపాటు ఆమె తండ్రిని సైకిల్ పార్టీలోకి తీసుకు వచ్చి.. వారిరువురికీ.. అంటే కుమార్తెకు ఎంపీ సీటు, తండ్రికి ఎమ్మెల్యే సీటు కేటాయించే విధంగా చంద్రబాబు స్కెచ్ వేశారన్న ప్రచారం నంద్యాల జిల్లాలో కొనసాగుతోంది. అదీకాక.. మరికొ ద్ది రోజుల్లో చంద్రబాబు అధ్యక్షతన నంద్యాలలో భారీ బహిరంగ సభ ఉందని… ఆ సభలో ఈ తండ్రి కూతుళ్లు పసుపు కండువా కప్పుకొని.. తెలుగుదేశం గూటికి చేరతారనే టాక్ వినిపిస్తోంది.
ఇక రాయలసీమలో బైరెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి వేళ వారు పార్టీలోకి వస్తే.. జిల్లాలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందనే భావన కూడా తెలుగుదేశం పార్టీ కేడర్‌లో వ్యక్తమౌతోందంటున్నారు. పాణ్యం ఎమ్మెల్యే టికెట్ బైరెడ్డి రాజశేఖరరెడ్డికి కేటాయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఈ అంశంపై ఇప్పటికే బైరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం అగ్రనేతల నుంచి స్పష్టమైన హామీ అందిందనే ఓ ప్రచారం కూడా నడుస్తోంది. రాయలసీమ హక్కుల కోసం.. నీటి వాటా కోసం భైరెడ్డి రాజశేఖరరెడ్డి ఉద్యమాలు చేస్తున్న విషయం విదితమే.
అయితే రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గాల ఇన్‌చార్జీలను మార్చడంతో పాటు.. బదిలీ చేస్తున్నారు. దీంతో పలువురు అసంతృప్త జీవులు.. వైసీపీకి రాం రాం చెప్పి.. మరో పార్టీలోకి వెళ్లి పోతున్నారు. ఆ క్రమంలో వల్లభనేని బాలశౌరి, కొలుసు పార్థసారధి, వసంత కృష్ణ ప్రసాద్ ఇలా పలువురు ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు, ఎంపీలు ఇప్పటికే వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన సంగతి తెలిసిందే. రానున్న రోజులలో ఆ జాబితాలోకి మరింత మంది చేరు అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
దీంతో ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్.. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ కూటమితో బీజేపీ సైతం కలిసి అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. ఓ వేళ టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ వెళ్లితే… రానున్న ఎన్నికల్లో ఆ కూటమి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని.. ఇక బీజేపీలో నుంచి టీడీపీలోకి వచ్చి పోటీ చేయనున్న బైరెడ్డి శబరియే కాదు.. ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి గెలుపు కూడా పక్కాగా ఖాయమనే ఓ వాదన అయితే జిల్లా పోటికల్ సర్కిల్లో హాట్ హాట్‌గా హీట్ హీట్‌గా నడుస్తోంది.