Leading News Portal in Telugu

తెలుగుదేశం, జనసేన కూటమితోనే కమలం.. బాబు, పవన్ ఆమోదించిన వారికే బీజేపీ టికెట్లు! | bjp with tdp janasena| seat| sharing| finalise| official| announcement


posted on Mar 8, 2024 9:48AM

తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఖరారైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపుతో ఢిల్లీకి చేరుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్  అమిత్‌షాతో , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో భేటీ అయ్యారు. వీరి భేటీతో టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరిక ఖరారైంది. సీట్ల సర్దుబాటు కూడా ఖరారైందని అంటున్నారు. సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రాథమిక సమాచారం మేరకు  బీజేపీకి 5ఎంపీ, 9 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు బీజేపీ వర్గాల సమాచారం. అయితే గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని, లేకపోతే వైసీపీ లబ్ధి పొందుతుందన్న బాబు సూచనతో అమిత్ షా, నడ్డాలు ఏకీభవించినట్లు చెబుతున్నారు.  అలాగే తెలుగుదేశం, జనసేన ఓటు బదిలీ అయ్యే అభ్యర్ధులనే  బీజేపీ బరిలోకి దింపే విధంగా కూడా అమిత్ షా, నడ్డాలు బాబుకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు.  మొదటి నుంచీ తెలుగుదేశంను వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలకు సీట్లు ఇచ్చినా, అక్కడ ఓటు బదిలీ కాకపోతే ఉభయులకూ నష్టమని, అలా నష్టం చేకూర్చే విధంగా తమ అభ్యర్థుల ఎంపిక ఉండదనీ అమిత్ షా, నడ్డాలు విస్పష్టంగా చెప్పినట్లు బీజేపీ వర్గాల నుంచే తెలుస్తోంది. దంతో పొత్తులో బాగంగా బీజేపీకి  సీట్లు దక్కినా,  అది ఏ విధంగానూ ప్రత్యక్షంగానైనా,  పరోక్షంగానైనా  వైసీపీకి ప్రయోజనం చేకూరేలా ఉండకుండా క్షేత్రస్థాయి పరిస్థితులుపై అభ్యర్థుల ఎంపిక ఉండాలన్న విషయంలో తెలుగుదేశం, జనసేన కూటమి షరతును షా, నడ్డా అంగీకరించినట్లు చెబుతున్నారు.

 ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు పొత్తులో భాగంగా బీజేపీ విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట, అరకు, హిందూపురం, తిరుపతి పార్లమెంటు స్థానాలలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే  పురందేశ్వరి, సత్యకుమార్, సుజనాచౌదరి, రఘురామకృష్ణంరాజు, గీత   పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు.  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌కు హిందూపురం కాకపోతే, రాజంపేట, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి   విజయవాడ లేదా ఏలూరు, పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అలాగే అరకు ఎంపీగా   గీత పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నర్సాపురం నుంచి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు  బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయంటున్నారు.  ఇక అసెంబ్లీలో 9 చోట్లా కూడా బీజేపీ గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని తెలుగుదేశం, జనసేన  అధినేతలు బీజేపీ అగ్రనేతలకు విస్పష్టంగా చెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి.