Leading News Portal in Telugu

వైసీపీలో నాని సీన్ అయిపోయిందా?.. బేలమాటలు అందుకేనా?! | nani scene over in ycp| last| elections| comment| abuses| soft| words| gudivada| ticket


posted on Mar 9, 2024 3:20PM

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోడాలి నానికి భవిష్యత్తు దర్శనం బాగానే అయినట్లుంది. అందుకే.. ఇవే తన చివరి ఎన్నికలంటూ… ఆయన.. తన నియోజకవర్గ ప్రజలకు చాలా సాఫ్ట్‌గా.. కాదు కాదు బేలగా చెబుతున్నారు. ఎలాగోలా గెలిపించి పుణ్యం కట్టుకోండంటూ అన్యాపదేశంగా బతిమలాడుకుంటున్నారు.  నిన్న మొన్నటి వరకు అది అసెంబ్లీ అయినా, మీడియా సమావేశమైనా ఎక్కడైనా, ఎప్పుడైనా నాని నోరెత్తారంటే..  ఆడు చెప్పాడా?.. ఈడు చెప్పాడా? ఆ డమ్మా మొగుడు చెప్పాడా? అంటూ బండ బూతులతో చెలరేగిపోయేవారు. అలాంటి నాని నోట సాఫ్ట్ గా ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే బేలగా ఇవే నా చివరి ఎన్నికలు వంటి మాటలు రావడం చూస్తుంటే ఆయనకు ఏదైనా బోధివృక్షం కనిపించిందా? దాని కింద కూర్చోవడంతో జ్ణానోదయం అయి తత్వం బోధపడి బొమ్మకనిపించిందా అన్న అనుమానాలు వైసీపీ శ్రేణులలోనే వ్యక్తం అవుతున్నాయి.  

రానున్న ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి మండల హనుమంతరావు పేరును పార్టీ అధినేత జగన్ పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే  గుడివాడ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.  ఇటీవల గుడివాడ పట్టణంలో… రాత్రికి రాత్రే నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే మండల హనుమంతరావు అంటూ భారీ ఫ్లెక్సీలు   వెలిశాయి. ఈ హాఠాత్  పరిణామంతో కొడాలి నాని వర్గం ఒక రేంజ్‌లో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అంతే కాదు తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.   దాంతో ఈ అంశాన్ని నాని  తాడేపల్లి ప్యాలెస్‌  పెద్దలకు తెలియజేశారు. ఇక వారి నుంచి  వచ్చే సమాధానం కోసం ఆయన, ఆయనతో పాటు ఆయన వర్గం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే    కొడాలి నాని  నిర్వేదంలో కూరుకుపోయి.. ఇవే తన చివరి ఎన్నికలంటూ మాట్లాడారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

ఇప్పటికే గుడివాడ నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. 2004, 2009లో టీడీపీ నుంచి గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత జగన్ పార్టీలో చేరి.. 2014, 2019లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా  గెలుపోందారు.  2019లో  జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆయన కేటినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా కొడాలి నాని  ఎలా వ్యవహరించారో.. ఎలా మాట్లాడారో అందరికీ తెలిసిందే. దీంతో   పౌరసరఫరాల శాఖ మంత్రి కాదు.. బూతు సరఫరాల శాఖ మంత్రి అంటూ  కొడాలి నానిపై సోషల్ మీడియాలో  నెటిజనులు విపరీతంగా ట్రోల్ చేశారు.  

అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కొడాలి నాని ఇప్పుడు ఇలా  చాలా సాఫ్ట్‌గా.. ఇంకా చెప్పాలంటే.. తనకు వయస్సైపోయిందనీ,  53 ఏళ్లతాను ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే.. 58 ఏళ్ల వరకు ఎమ్మెల్యేగా ఉంటానని.. ఆ తర్వాత అంటే.. 2029 ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. అదే సమయంలో వ్యూహాత్మకంగా  తన కుమార్తెలు రాజకీయాల్లోకి రారని క్లారిటీ ఇవ్వడమే కాకుండా.. తన రాజకీయ వారసుడిగా తన తమ్ముడు కొడాలి చిన్ని కుమారుడు వచ్చే అవకాశం ఉందంటూ సంకేతం ఇచ్చారు. మొత్తం మీద కొడాలి నాని బేల మాటలు వైసీపీలో ఆయన సీన్ అయిపోయిందన్న సంకేతాలు ఇస్తున్నాయన్న చర్చ జోరందుకుంది. 

అదీకాక కొడాలి నాని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే ఓ ప్రచారం ఓ వైపు జరుగుతుండగా.. మరోవైపు ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వచ్చి వెళ్తున్న దృశ్యాలు సైతం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఆ క్రమంలోనే కొడాలి నాని ఇవి తనకు చివరి ఎన్నికలు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారనే ఓ చర్చ సైతం ఊపందుకొంది.   

ఏదీ ఏమైనా మిర్చిలాగా ఎప్పుడు హాట్ హాట్‌ కామెంట్స్ చేసే కొడాలి నాని.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇవే తనకు చివరి ఎన్నికలనీ.. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ.. చాలా సాఫ్ట్‌గా మాట్లాడడం చూస్తుంటే…. ఎక్కడో ఏదో తేడా కొడుతుందని.. కానీ అది అంతగా అంతు బట్టకుండా ఉందనే ఓ చర్చ సైతం గుడివాడ నియోజకవర్గంలో వైరల్ అవుతోంది. అదీకాక ఇప్పటికే ఇదే డైలాగ్ ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం వాడారని.. కృష్ణాజిల్లా వాసులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. 

మరోవైపు తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన పాడి కౌశిక్ రెడ్డి.. కమలాపుర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ..  మీరు ఓటు వేసి దీవిస్తే.. 4వ తేదీన ఎమ్మెల్యేగా జైత్ర యాత్ర చేస్తా.. లేకుంటే శవయాత్ర చేసుకుంటాం… మా కుటుంబ సభ్యులం ముగ్గురు ఆత్మహత్య చేసుకంటామంటూ ఓ సెంట్‌మెంట్ ఆయుధాన్ని ఉపయోగించి.. ఎమ్మెల్యేగా ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారని… ఈ తరహా ట్రిక్స్‌ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఉపయోగించే అవకావం ఉందనే ఓ చర్చ సైతం వైరల్ అవుతోంది. అదీకాక కొడాలి నాని.. తన రాజకీయ వారసుడిని సైతం ఈ సందర్బంగా చెప్పకనే చెప్పారనే ఓ చర్చ సైతం నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తోంది.