posted on Mar 9, 2024 4:04PM
బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీతో పొత్తు ఖరారైందని పార్టీ నేతలకు చెప్పారు. కాసేపట్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి ఉమ్మడి ప్రకటన వస్తుందని తెలిపారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకతను చంద్రబాబు తమ పార్టీ నేతలకు వివరించారు. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని నేతలకు సూచించారు.
ఆదివారం విజయవాడలో చంద్రబాబు ఆయన సతీమణి పురందేశ్వరి, జనసేనాని పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
బీజేపీతో సీట్ల పంపకంపై ఓ అవగాహనకు వచ్చామని, మరో సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని చంద్రబాబు వివరించారు. మూడు పార్టీల మధ్య పొత్తుపై ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, కేంద్రం సహకారం అవసరమని, పొత్తుకు ఇదే కారణమని వెల్లడించారు. ప్రస్తుతం చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీలోనే ఉన్నారు. వారిరువురు మరోసారి బీజేపీ అగ్రనేతలతో సమావేశమై సీట్ల పంపకంపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.
భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సీట్ల లెక్క తేలింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ శనివారం నాడు చర్చలు జరిపారు. 50 నిమిషాల పాటు జరిపిన సమావేశంలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలని ముగ్గురు నేతలు నిర్ణయం తీసుకున్నారు.