Leading News Portal in Telugu

మిస్టీరియస్ గా మారిన గోయెల్ రాజీనామా


posted on Mar 10, 2024 5:03PM

2024 లోక్​సభ ఎన్నికలకు ముందు, తాజా పరిణామాలతో.. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరిని మోదీ నియమించనున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం.

అరుణ్​ గోయల్​ అసలు ఎందుకు రాజీనామా చేశారు? అన్న ప్రశ్నకు ప్రస్తుతం స్పష్టమైన సమాధానం లేదు. కానీ.. పలు విషయాల్లో ఆయనకు ఇతరులతో విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు.  

ఎన్నికల కమిషనర్​గా గోయల్​ నియామకంపైనా అప్పట్లో వివాదం చెలరేగింది. 2022 నవంబర్ 18న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్) నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2022 డిసెంబర్ 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. పదవీ విరమణ సమయంలో గోయల్ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు.

కాగా.. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మరుసటి రోజే ఆయనను ఎన్నికల కమిషనర్​గా నియమించింది. కేంద్రం. దీనిపై అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్ ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​లో.. కేంద్ర నిర్ణయం ఏకపక్షంగా ఉందని, భారత ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రత, స్వతంత్రతను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈసీగా నియామకానికి ముందే స్వచ్ఛంద పదవీ విరమణ పొందేందుకు గోయల్​కు విశేషమైన దూరదృష్టి ఉన్నట్లు కనిపిస్తోందని ఏడీఆర్ వ్యంగ్యంగా విమర్శించింది.

జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 2023 ఆగస్టులో ఈ పిటిషన్​ని కొట్టివేసింది.

ఎన్నికల కమిషనర్​గా అరుణ్​ గోయల్​ రాజీనామాపై ఇప్పుడు దేశంలో రాజకీయ దుమారం చెలరేగింది! బీజేపీపై విపక్షాలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్​ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తోంది.

వాస్త‌వానికి  ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ లోక్ సభ ఎన్నికల సన్నాహాల్లో ఇటీవల చురుగ్గా పాల్గొన్నారు.. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పలు రాష్ట్రాల పర్యటనలు చేపట్టారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. గడువు సమీపిస్తోంది. ఈ నెల 13 లేదా 14 తేదీల్లో షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒడిశాలో బిజూ జనతాదళ్, అరుణాచల్ ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా- బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. 

2019 తరహాలోనే దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్ పూర్తి అయ్యేలా కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు షెడ్యూల్‌ను రూపొందించినట్లు చెబుతున్నారు. ఏప్రిల్ రెండోవారంలో తొలి దశ పోలింగ్ ఉండొచ్చు. మే 18 లేదా 20వ తేదీ నాటికి పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుంది. అదే నెల చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఈ పరిస్థితుల్లో అనూహ్యం సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ తన 

పదవికి రాజీనామా చేశారు. ఈ కీలక సమయంలో అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం అత్యంత మిస్టీరియస్‌గా మారింది.

గోయల్ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2022 నవంబర్ 18న ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు.   పంజాబ్ కేడర్‌కు చెందిన మాజీ IAS అధికారి. అతను నవంబర్ 21, 2022న అధికారికంగా ఎన్నికల కమీషనర్ పాత్రను స్వీకరించాడు. అతని పదవీకాలం 2027లో ముగియనుంది. గోయెల్ గతంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో అరుణ్ గోయల్ నియమితులయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఊహించని విధంగా అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. గోయ‌ల్ రాజీనామా పై దేశ‌వ్యాప్తంగా చర్చ జ‌రుగుతోంది. 

ఇప్పటికే ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ లోని మరో కమిషనర్ అనుప్ పాండే.. గత నెలలో పదవీ విరమణ చేయగా ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా అరుణ్ గోయెల్ కూడా రాజీనామా చేయడంతో ఇక ఆ ప్యానెల్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. ఈయన పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుండటంతో… ఈయన అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అరుణ్ గోయెల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈలోగా ఆయన రాజీనామా చేశారు. కాగా… ఈ నెల 14, 15 తేదీల్లో లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావొచ్చని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో గోయెల్ రాజీనామా చేయడం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలుస్తుంది!