మూడూ ఒకటే.. జగన్ కు ఇక ఇక్కట్లే! | allaince in ap strong| bjp| accepts| ground| reality| reject| tickets| pro| ycp
posted on Mar 11, 2024 11:28AM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ కు ఇక్కట్లు తప్పవా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందా? కలవదా? కలిస్తే అది తెలుగుదేశం, జనసేన కూటమికి ప్రయోజనమేనా? బీజేపీపై ఏపీలో ఉన్న ఆగ్రహం కూటమిపై కూడా ప్రభావం చూపుతుందా? అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. పరిశీలకులు, కొన్ని సర్వేలు సైతం బీజేపీతో కలయిక తెలుగుదేశం పార్టీకి పెద్దగా లబ్ధి చేకూర్చే అవకాశాలు లేవనీ, ఏదో మేరకు నష్టం కూడా వాటిల్లే అవకాశాలున్నాయనీ పేర్కొన్నాయి. అయితే ఒక సారి తెలుగుదేశం, జనసేన కూటమితోనే ఏపీలో కలిసి వెళ్లాలని బీజేపీ నిర్ణయించుకున్న తరువాత జరిగిన పరిణామాలను గమనిస్తే, ఆ అనుమానాలన్నీ దూది పింజెల్లా తేలపోయాయి. 2019 ఎన్నికల తరువాత ఏపీ విషయంలో బీజేపీ తొలి సారిగా తన వాస్తవ బలం ఏమిటన్నది గుర్తించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీ ఎన్ని సీట్లు సాధించుకున్నా.. ఎన్ని స్థానాలలో పోటీ చేసినా.. ఆయా స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సింది మాత్రం తెలుగుదేశం, జనసేనలే. ఎందుకంటే వాస్తవంగా చూసుకుంటే బీజేపీకి ఏపీలో ఒక్కటంటే ఒక్క శాతం ఓటు స్టేక్ కూడా లేదు. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే.. ఆ పార్టీకి బలమైన అభ్యర్థులూ లేరు. పోటీ చేసే స్థానాలలో బూతు ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి.
అయితే కేంద్రంలో అధికారంలో ఉండటం, మరో సారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న అంచనాలు బలంగా ఉండటంతో.. రాష్ట్ర ప్రయోజనాలను, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సహకారాన్నీ దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీతో పొత్తుకు రెడీ అయ్యింది. ఆ పార్టీ పొత్తు విషయంలో నిర్ణయం తీసుకునే వరకూ వేచి చూసింది. ఒక సారి బీజేపీ కూడా తమ కూటమితో కలిసి వస్తుందన్న నిర్ణయం జరిగిపోగానే.. తెలుగుదేశం, జనసేన అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ హస్తినకు వెళ్లి రాష్ట్రంలో పరిస్థితిని, కూటమి గెలుపు అవకాశాలనూ ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కూలంకషంగా వివరించారు. గత ఐదేళ్లుగా ఏపీలో బీజేపీలోని ఒక వర్గం వ్యవహరించిన తీరు కారణంగా బీజేపీ రాష్ట్రంలోని అధికార వైసీపీతో అంటకాగుతోందన్న భావన ప్రజలలో బలంగా ఉందని సోదాహరణగా వివరించారు.
ఆ కారణంగా ప్రజలలో బలంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అంతే బలంగా బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ పార్టీ అగ్రనేతలకు అర్ధమయ్యేలా వివరించగలిగారు. ఆ కారణంగానే బీజేపీ పెద్దలు ఏపీతో పొత్తుల విషయంలో తెలుగుదేశం, జనసేన కూటముల అభిప్రాయాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ పొత్తు కారణంగానే కనీసం ఒక్కశాతం ఓటు కూడా లేని కమలం పార్టీకి ఏవో కొన్న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు దక్కనున్నాయన్న సంగతి బీజేపీ పెద్దలకు స్పష్టంగా తెలుసు. అలా కాకుండా అధికార పార్టీతోనే అంటకాగుతున్నామన్న భావన కలిగేలా కూటమితో కలవకపోయినా, అధిక స్థానాలు డిమాండ్ చేసి పొత్తు పొసగకపోవడానికి కారణమైనా ఏపీలో కనీస ప్రాతినిథ్యం కూడా ఉండే అవకాశం లేదని బీజేపీ అగ్రనాయకత్వానికి స్పష్టంగా తెలుసు. ఆ విషయాన్ని పరిగణనలోనికి తీసుకునే పొత్తు విషయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కొందరు చేసిన అతి ప్రకటనలను పూర్తిగా పక్కన పెట్టేయడమే కాకుండా, పొత్తులో భాగంగా తమకు వచ్చిన స్థానాలలో కూడా తెలుగుదేశం, జనసేనలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థులనే నిలపడానికి కూడా బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించడమే ఆ పార్టీ వాస్తవిక పరిస్థితులను గ్రహించే పొత్తుకు ముందుకు వచ్చిందన్న సంగతి స్పష్టంగా అవగతమౌతుంది.
ఎందుకంటే ఇంత కాలం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న అధికార వైసీపీపై కాకుండా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా విపక్ష తెలుగుదేశంపై పోరాడిందన్న భావన ప్రజలలో బలంగా ఉంది. అలా ఉండటానికి కారణం బీజేపీ ఏపీ నాయకులలో కొందరు చేసిన అతే కారణమనడంలో సందేహం లేదు. అదే విధంగా ఏపీ సర్కార్ ఆర్థిక అరాచకత్వాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ చూసీ చూడనట్లు వదిలేసిందన్న భావన కూడా ప్రజలలో ఉంది. జగన్ సర్పంచ్ లకు తెలియకుండానే పంచాయతీరాజ్ నిధులను డ్రా చేసుకుని ఇతర అవసరాలకు వాడేయడం వంటి వ్యవహారాలను కేంద్రం సీరియస్ గా తీసుకోకపోవడంతో జనంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జగన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తోందన్న భావన ఏర్పడింది.
ఏపీ విషయంలో నాన్ సీరియస్ గా వ్యవహరించడం వల్ల జరిగిన నష్టాన్ని గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు పొరపాట్లను సవరించుకుని, రాష్ట్ర పార్టీలో వైసీపీ అనుకూల శక్తుల పట్ల సీరియస్ గా దృష్టి పెట్టింది. అందుకే ఏపీ బీజేపీలోని వైసీపీ అనుకూల నేతలకు పోటీ చేసే అవకాశం ఇవ్వవద్దన్న తెలుగుదేశం, జనసేన కూటమి షరతుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో వైసీపీ అనుకూల నేతలుగా ముద్రపడిన సోము వీర్రాజు, జీవీఎల్ సహా ఎవరికీ వచ్చే ఎన్నికలలో పోటీకి అవకాశం ఉండదని బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు స్పష్టం చేసినట్లు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతే కాదు తొలి నుంచీ హిందూపురం లోక్ సభ స్థానం నుంచి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డిని కూడా పక్కన పెట్టేసినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఏపీ నుంచి బీజేపీ అభ్యర్ధులుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై పోరాడిన వారికి మాత్రమే కమలం పార్టీ టికెట్లు ఇచ్చేందుకు నిర్ణయించిందని అంటున్నారు. బీజేపీ అభ్యర్థులుగా తాము ఎవరికి టికెట్ ఇచ్చినా వారు గెలవాల్సింది మాత్రం తెలుగుదేశం, జనసేన ఓట్లతోనే అన్న వాస్తవాన్ని గుర్తెరిగిన కమలనాథులు.. ఆ రెండు పార్టీలకూ ఆమోదయోగ్యమైన అభ్యర్థులనే బరిలోకి దింపాలన్న నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.