Leading News Portal in Telugu

వైఎస్, బాబు పాలన ఎంతో నయం.. జగన్ పాలనలోనే క్రిస్టియన్లకు కష్టాలు.. బ్రదర్ అనీల్ | brother anli criticize jagan rule| babu| ys| rule| good| christians| face| troubles| ycp


posted on Mar 11, 2024 2:24PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి గత ఎన్నికలలో తాను అధికారంలోకి రావడానికి దోహదపడిన ప్రతి అంశమూ కూడా ఇప్పుడు ప్రతికూలంగా  మారి అధికారానికి దూరం కావడానికి దోహదపడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఎన్నికలలో కారణాలేమైతేనేం.. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు వేరువేరుగా రంగంలోకి దిగాయి. దీంతో జగన్ కు సునాయాసంగా అధికారం దక్కింది.  తెలుగుదేశం, జనసేన, బీజేపీలో వేర్వేరుగా పోటీ చేయడం ఒక్కటే కాదు.. రాష్ట్రంలో క్రైస్తవ సమాజం మొత్తం గంపగుత్తగా జగన్ కు మద్దతు పలకడం కూడా జగన్ పార్టీ విజయానికి ప్రధాన కారణమనడంలో సందేహం లేదు.  

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యిందంటున్నారు. స్వ‌త‌హాగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న కుటుంబం  క్రిస్టియన్లు కావ‌డంతో ఆ మ‌తానికి చెందిన వారు దాదాపు గంప‌గుత్త‌గా   వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు.  అలా నిలవడానికి ప్రధాన కారకుల్లో ఒకరు   జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి ష‌ర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌ అనడానికి సందేహం అవసరం లేదు. అప్పట్లో  ఆయన ఏపీ వ్యాప్తంగా ప‌ర్య‌టించి క్రిస్టియ‌న్ల‌ను వైసీపీవైపు మొగ్గు చూపేలా చేయడంలో సఫలీకృతులయ్యారు.  క్రిస్టియ‌న్లు అంటే కేవ‌లం ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాలే కాదు.. బీసీలు, ఓసీల్లోని క‌మ్మ‌, కాపు, రెడ్డి కుల‌స్థులు కూడా అధికంగానే ఉన్నారు.  కులంతో సంబంధం లేకుండా కేవ‌లం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్రిస్టియ‌న్ అనే కార‌ణంతో  అప్పట్లో చంద్ర‌బాబును దూరంపెట్టి వాళ్లంతా జ‌గ‌న్ కు మద్దతుగా నిలిచారు.

అయితే అదంతా గతం. ఐదేళ్లు గిర్రున తిరిగాయో లేదో.. ఇప్పుడు గతంలో జగన్ కు మద్దతుగా నిలిచిన క్రిస్టియన్లు ఇప్పుడు గతంలోలా గంపగుత్తగా ఆయనవైపు నిలిచే పరిస్థితి లేదు.  ఎందుకంటే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన క్రిస్టియ‌న్ల‌కు ఆయన చేసిన మేలేమీ లేకపోగా.. కులం ప్రాతిపదికన వారిని చిన్న చూపు చూశారు.  ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల వారి ఆత్మగౌరవం దెబ్బతినేలా జగన్ సర్కార్ వ్యవహరించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్సీఎస్టీలపై దాడులు జరిగాయి.  అంతే కాదు.. గత ఎన్నికలలో క్రిస్టియన్ల ఓట్లు గంపగుత్తగా వైసీపీకి మళ్లడంలో కీలక భూమిక పోషించిన షర్మిల భర్త బ్రదర్ అనీల్ ఇప్పుడు జగన్ కు దూరం జరిగారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన కాంగ్రెస్ కు అనుకూలంగా క్రిస్టియన్లను ఏకం చేయడం కోసం పని చేస్తున్నారు.  

దీని వల్ల తనకు జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో జగన్ కు తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా తన మేనత్త, అంటే తన తండ్రి సోదరి విమలారెడ్డిని రంగంలోకి దింపారు.  ఆమె  జిల్లాల్లో  విస్తృతంగా పర్యటనలు చేస్తూ.. చ‌ర్చి ఫాద‌ర్లతో భేటీ అవుతున్నారు. అయితే క్రిస్టియన్ సొసైటీలో విమలారెడ్డికి పెద్దగా గుర్తింపు లేదు. అధికార పార్టీ అండతో మాత్రమే ఆమె చర్చి ఫాదర్లకు తాయిలాలు పంచుతూ తన సమావేశాలకు హాజరయ్యేలా చేసుకోగలుగుతున్నారు. అయితే చర్చి ఫాదర్లు, పాస్టర్లతో ఆమె సమావేశాలు పెద్దగా ఫలితాన్నిస్తున్నట్లు కనిపించడం లేదు. అంతే కాకుండా ఇంత పంచుతాము, అంత ఇస్తాము అంటూ ప్రలోభపెట్టి తీరా సమావేశం పూర్తయిన తరువాత ఏదో అరకొరగా చేతిలో పెట్టి చేతులుదులుపుకోవడంతో విమలారెడ్డిపై ఫాదర్లు, పాస్టర్లలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల కాకినాడలో  ఆమె నిర్వహించిన సదస్సుకు దాదాపు రెండు వేల మంది పాదర్లు, పాస్టర్లు పాల్గొన్నారు. అంత సంఖ్యలో వారు రావడానికి కారణం నిర్వాహకులు భేటీ ముగిసిన తరువాత ఒక్కొక్కరికీ వేయి రూపాయలు ఇస్తామంటూ ప్రలోభాలకు గురి చేయడమే. ఈ విషయం సదస్సు ముగిసిన తరువాత ఫాస్టర్లు ఆందోళనకు దిగడంతో వెల్లడైంది. వేయి రూపాయలు ఇస్తామని చెప్పి తీరా సదస్సు ముగిశాకా ఐదొందలు మాత్రమే చేతిలో పెట్టారంటూ కాకినాడ సదస్సుకు హాజరైన ఫాస్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో వ్రతమూ చెడి, ఫలమూ దక్కలేదన్నట్లుగా తయారైంది  వైసీపీ పరిస్థితి. సముదాయించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన నిర్వాహకులు మొహం చాటేశారు. విమలారెడ్డి చర్చి బ్యాక్ డోర్ నుంచి కారులో పలాయనం చిత్తగించారు. ఈ సంగతి మీడియాలో ప్రముఖంగా రావడంతో విమలారెడ్డికి అసలే అంతంత మాత్రంగా ఉన్న రెపుటేషన్ మరింత తగ్గింది. 

ఇక ఇప్పుడు షర్మిల భర్త బ్రదర్ అనీల్ రంగంలోకి దిగారు. జగన్ కు, ఆయన పార్టీకి వ్యతిరేకంగా పాస్టర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జగన్ ఏలుబడిలో పాస్లర్లు ఎదుర్కొన్న సమస్యలను సవివరంగా వివరిస్తున్నారు. క్రైస్తవులకు మేలు జరగలేదని చెబుతున్నారు. తాజాగా అమలాపురంలో పాస్టర్ల సమావేశంలో పాల్గొన్న బ్రదర్ అనీల్ కుమార్ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలనలో కానీ   క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు.   వైఎస్ హయాంలో క్రైస్తవులు ఇబ్బందులకు గురౌతున్నారని  చెప్పకనే చెప్పారు. వైఎస్ బిడ్డే కదా అని జగన్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రంలో క్రైస్తవులు సువార్త సభలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని అనీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.   రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పడం ద్వారా నేరుగా జగన్ పేరు ఎత్తకుండానే ఆయన పార్టీకి ఓటువేయవద్దని సూటిగా, సుత్తిలేకుండా స్పష్టంగా చెప్పారు.  జగన్ రెడ్డిని గెలిపించడం అంటే దేవుడ్ని మోసం చేసడమేనంటున్నారు.  శత్రువులంతా అంతమైపోవాలని భగవంతుడిని ప్రార్థిద్దామంటున్నారు.

అనిల్ రెడ్డి అమలాపురంలో చేసిన వ్యాఖ్యల వల్ల  ఆయన  సువార్త సభలను ఏపీలో పెట్టుకోలేని పరిస్థితులను జగన్ సృష్టించారని తేటతెల్లమౌతున్నది.  మొత్తం మీద బ్రదర్ అనీల్ ప్రసంగాలు క్రిస్టియన్లను వైసీపీకి దూరం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ కు అనుకూలంగా క్రైస్తవ సమాజాన్ని కదిలించిన ఆయన ప్రసంగాలు ఇప్పుడు అదే  జగన్ కు  క్రీస్టియన్లను దూరం చేయడం తథ్యమని అంటున్నారు.