Leading News Portal in Telugu

పద్మనాభం.. ఉత్తరాల కుమారుడేనా?.. నవ్వుల పాలౌతున్న ముద్రగడ! | mudragada withdraw rally| alone| tadepally| join| ycp| date| tentative| letters| pride


posted on Mar 13, 2024 3:00PM

ముద్రగడ పద్మనాభం. రాజకీయాలతో కనీస పరిజ్ణానం ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఆ పేరు చిరపరిచితమే. కాపు జాతి ఉద్ధరణకే జీవితాన్ని అంకితం చేశానని తనకు తాను ప్రకటించుకునే  ముద్రగడ విభజిత ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ అధికారం చేపట్టిన తరువాత మాత్రం  తాను ఉద్ధరిస్తానని చెప్పుకునే కాపు జాతికి దూరం దాదాపుగా ఆయన అయ్యారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారమయ్యారు. ఔను కాపులకు రిజర్వేషన్ల విషయంలో జగన్ కుండబద్దలు కొట్టినట్లు అది సాధ్యమయ్యేపని కాదని తేల్చేసిన తరువాత కూడా పన్నెత్తు మాట అనక పోవడమే కాకుండా.. ఇంకా ఆయననే వెనకేసుకు వస్తూ.. చట్టపరమైన ఇబ్బందులు ఏవీ ఎదురుకాకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేసిన చంద్రబాబును వ్యతిరేకించడమే కాదు, అదే కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు పవన్ కల్యాణ్ నేతగా ఎదుగుతుంటే ఓర్వలేని తనంతో లేఖలు గుప్పించారన్న అభిప్రాయం ఆ సామాజికవర్గ ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది.

అసలు   కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం ఉద్య‌మం అంటూ చెప్పుకుంటూ పబ్బం గడుపుకున్న ముద్రగడ తెలుగుదేశం హ‌యాంలో  ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్నంత‌కాలం కాపు రిజ‌ర్వేష‌న్లు అంటూ తెగ హ‌డావుడి చేసిన ముద్ర‌గ‌డ, జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత ఆ ముచ్చటే ఎందుకు ఎత్తలేదని నిలదీస్తున్నారు.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపు రిజ‌ర్వేష‌న్లుకు తాను వ్యతిరేకం అని విస్పష్టంగా ప్రకటించిన జగన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని ముద్రగడ, ఆ ఎన్నికలలో  ఆయనను గెలిపించేందుకు తనవంతు కృషి చేసి.. కాపు రిజర్వేషన్లు అన్నది కేవలం తన సామాజికవర్గంలో పాపులారిటీని పెంచుకునేందుకే అని చెప్పకనే చెప్పేశారని అంటున్నారుప. అంతే కాకుండా జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తరువాత ఇంత కాలం, కాపు రిజ‌ర్వేష‌న్లు, కాపు ఉద్య‌మం ఊసే ఎత్తని ముద్రగడపై   కాపు సామాజిక వ‌ర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.   

అదే సమయంలో అదే సామాజికవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎదుగుతుండటం, అన్ని వర్గాలకూ న్యాయం అన్న ఉద్దేశంతో సాగుతుండటంతో కాపు సమాజికవర్గం యువత ఆయనవైపు మొగ్గు చూపుతున్నది. దీంతో సహజంగా ఇంత కాలం కాపు నేతగా చెలామణి అయిన ముద్రగడకు ఈ పరిణామం నచ్చలేదు. దీంతో ఇప్పటి వరకూ కప్పుకున్న ముసుగు తొలగించి కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకమని బాహాటంగా ప్రకటించిన జగన్ పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారు. తనకు కాపు సామాజికవర్గం నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఉంటుందని భావించిన ముంద్రగడ.. తాను జగన్ పార్టీలో చేరుందుకు తాడేపళ్లికి భారీ ర్యాలీలో వెడతానని ప్రకటించి, కనీసం పది వేల మంది తమ సొంత వాహనాల్లో ఆ ర్యాలీలో పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు.

ఉత్తరాలు రాయడంలో దిట్ట అయిన ముద్రగడ ఆ విషయం కూడా ఒక బహిరంగ లేఖ రూపంలోనే ఇచ్చారు. అయితే ఆయన ఊహలు తల్లక్రిందులయ్యాయి. ఆయన వైసీపీలో చేరే సందర్భంగా ర్యాలీగా ఆయన వెంట రావడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ పిలుపు ఉపసంహరించుకోకుంటే అభాసుపాలు కావడం ఖాయమని గ్రహించిన ముద్రగడ.. ఆ పిలుపు ఉపసంహరణతో పాటు వైసీపీ చేరిక ముహూర్తాన్ని సైతం మార్చేసుకున్నారు. 

భారీ సంఖ్యలో మద్దతుదారులతో వెళ్లడం ముఖ్యమంత్రి భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందన్న సమాచారంతో తాను ర్యాలీని విరమించుకున్నాననీ, తాను ఒక్కడినే, ఒంటరిగా తాడేపల్లి వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకుంటాననీ ఓ  బహిరంగ లేఖ రాసేశారు. ర్యాలీకి మీ ఏర్పాట్లు మీరే చేసుకుని పెద్ద సంఖ్యలో తరలిరండి అంటే లేఖ రాసిన రోజుల వ్యవధిలోనే ఎవరూ రావద్దు ఒంటరిగానే వెడతానంటూ ముద్రగడ రాసిన లేఖ నవ్వు పుట్టించడమే కాకుండా ఆయనను నవ్వుల పాలు కూడా చేసేసింది. అంతా కాదు ఇంకా ఆయనను నమ్ముతున్న అతి కొద్ది మంది కాపు సామాజికవర్గానికి చెందిన వారికి ముద్రగడ వెనుక ఎవరూ లేరన్న విషయాన్నీ తేటతెల్లం చేసేసింది.  అన్నిటికీ మించి జనంలోకి రాకుండా కేవలం లేఖలద్వారా పాపులారిటీ కోల్పోకుండా చూసుకోవచ్చన్న ఆయన ఎత్తుగడ.. ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాలలో నవ్వులు పూయిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధినేత హ్యూమర్ ను పూర్వపక్షం చేసేసి మాంఛి కామెడీ పండిస్తోంది.