Leading News Portal in Telugu

వార్ వన్ సైడే.. ముస్లిం ఓట్లపై వైసీపీ ఆశలు ఆవిరే! | election war one side in ap| ycp| hopes| muslims| votes| evaporate| trible| talaq| minority| women| side


posted on Mar 14, 2024 9:39AM

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు వార్ వన్ సైడ్ గా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. మరో వైపు మూడు పార్టీల పొత్తూ సజావుగా ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా పొడిచి.. సీట్ల సర్దుబాటు పూర్తై, అభ్యర్థుల ప్రకటనే తరువాయి అన్న పరిస్థితికి వచ్చేశాయి. అదే సమయంలో అధికారంలో ఉండి కూడా పోటీలు నిలబడే అభ్యర్థులు ఎవరన్నది తేల్చుకోలేక వైసీపీ నానా అగచాట్లూ పడుతోంది. సిట్టింగుల మార్పు అంటూ జగన్ మొదలెట్టిన ప్రయోగం వికటించిందని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలూ ఇప్పటికే పార్టీ వీడగా, మరి కొందరు అదే దారిలో ఉన్నారని వైసీపీ వర్గాలే బాహాటంగా చెప్పేస్తున్నాయి. 

అయినా వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేయడం మేకపోతు గాంభీర్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలవడం వల్ల కూటమికి ముస్లిం ఓటర్లు దూరం అవుతారన్న దింపుడు కళ్లెం ఆశతో వైసీపీ ఉందని రాజకీయవర్గాల్లో చ ర్చ జరుగుతోంది. 

ఆ ఆశ ఎందుకంటే.. ఏపీలోని కొన్ని నియోజకవర్గాలలో ముస్లింమైనారిటీల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. ప్రధానంగా రాయల సీమలోని కొన్ని నియోజకవర్గాలలో అయితే వారి ఓట్లే అభ్యర్థి విజయాన్ని నిర్థారిస్తాయి. 

 కర్నూలు, కడప, నంద్యాల, ఆదోని, హిందూపురం, పీలేరు, మదనపల్లి వంటి నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య 50 వేల నుంచి 80 వేల వరకూ ఉంది. ఆయా నియోజకవర్గాలలో ముస్లిం మైనారిటీలు ఏ పార్టీవైపు మొగ్గు చూపితే ఆ పార్టీయే విజయం సాధిస్తుంది.  అలాగే విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ఒంగోలు, చిలకలూరిపేట, నర్సరావుపేట, గురజాల వంటి నియోజవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య పాతిక నుంచి 35 వేల వరకూ ఉన్నాయి. అంటే ఈ నియోజకవర్గాలలో కూడా ముస్లిం మైనారిటీల ఓట్లే గెలుపు, ఓటములను నిర్ణయించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

ఇప్పుడు ఆ ముస్లిం మైనారిటీల ఓట్లపైనే వైసీపీ ఆశలన్నీ పెట్టుకుందని అంటున్నారు. అయితే పరిశీలకులు మాత్రం ఏపీలో మతం ప్రాతిపదికన ఓట్లు పడే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. ఒక వేళ అలాగే పడతాయని అనుకున్నా.. మోడీ సర్కార్ ట్రిబుల్ తలాక్ విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఆ పార్టీ పట్ల ముస్లిం మైనారిటీలలో గతంలోలా తీవ్ర వ్యతిరేకత   లేదని అంటున్నారు.