posted on Aug 13, 2024 5:25PM
మనం ఏదో పనిలో వుంటాం. లేదా ఏ వెహికల్ మీదో ప్రయాణం చేస్తూ వుంటాం. ఇంతలో సెల్ మోగుతుంది. ఏదో గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తూ వుంటుంది. ఏ ఇంపార్టెంట్ ఫోనో అనుకుని మనం లిఫ్ట్ చేస్తాం. హలో అంటాం. అవతల నుంచి నీ హలో ఎవడిక్కావాలన్నట్టు ఏదో రికార్డెడ్ మెసేజ్ వినిపిస్తూ వుంటుంది. లోన్ ఇస్తామనో… రియల్ ఎస్టేట్ అనో మెసేజ్ వినిపిస్తూ వుంటుంది. మనకి ఫోన్ నేలకేసి కొట్టాలన్న ఆవేశం వచ్చినా అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ వుంటాం. ఇలాంటి కాల్స్.ని టెలీకాం సంస్థలు తక్షణం చచ్చినట్టు ఆపి తీరాల్సిందేనని టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) సీరియస్గా ఆదేశాలు జారీ చేసింది. అన్ రిజిస్టర్డ్ టెలీ మార్కెటర్ల నుంచి ప్రమోషన్ కాల్స్, ప్రీ రికార్డెడ్ కాల్స్, కంప్యూటర్ జనరేటెడ్ కాల్స్.ని తక్షణం నిలిపివేయాలని ట్రాయ్ టెలీకాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. స్పామ్ కాల్స్ మీద వినియోగదారుల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి ఏ టెలీకాం కంపెనీ అయినా ఈ తరహా కాల్స్.కి అనుమతి ఇస్తే ఆ సంస్థకు రెండేళ్ళపాటు యాక్సెస్ నిలిపివేయడంతోపాటు, ఆ సంస్థను రెండేళ్ళపాటు బ్లాక్ లిస్టులో పెడతామని ట్రాయ్ హెచ్చరించింది.