మళ్లీ వలసలు షురూ!.. బీఆర్ఎస్ కు ఇక దబిడి దిబిడే.. విపక్ష హోదా హుళక్కే!? | mlas jumping from brs| revanth| operation| akarsh| ghmc| brslp| merger| clp
posted on Aug 13, 2024 3:05PM
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ పరిస్ధితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారౌతోంది. పరాజయం తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడం, కనీసం అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడానికి కూడా ఆసక్తి చూపకపోవడంతో పార్టీలో నాయకత్వ లోపం అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కీలక నేత హరీష్ రావులు కార్యకర్తలతో మమేకమౌతో, అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ చురుకుగా కనిపిస్తున్నా, అధినేత క్రియాశీలంగా లేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటుగా పరిణమించింది. దీంతో బీఆర్ఎస్ నుంచి వలసలు మొదలయ్యాయి. గతంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ఎలా అయితే ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ప్రత్యర్ధి పార్టీలను నిర్వీర్యం చేయడానికి వలసలకు పార్టీ తలుపులు బార్లా తీశారో.. ఇంచుమించు అదే విధంగా కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరే వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ తో ఎమ్మెల్యేలుగా గెలిచిన పది మంది కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. వారి రాజీనామాలకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ డిమాండ్ ను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిందిదేగా అంటూ జనం కూడా ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలను లైట్ గా తీసుకుంటున్నారు. ఇక కోర్టును ఆశ్రయించడం ద్వారా బీఆర్ఎస్ సాధించగలిగేది పెద్దగా ఏమీ ఉండదని పరిశీలకులు అంటున్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలో కోర్టులు నిర్దేశించజాలవు. దీంతో అనర్హత వేటు విషయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలలో ఎలాంటి ఆందోళనా కనిపించడం లేదు.
గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు నెమ్మదించాయి. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సెటిల్ అవుతోందన్న భావన విపక్షాలలో కలిగింది. అయితే మళ్లీ హఠాత్తుగా కనీసం ఆరడజను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న వార్తలు తెలంగాణ రాజకీయాలలో మరోసారి సెగపుట్టించాయి.రేవంత్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత మళ్లీ వలసల జోరు పెరుగుతుందంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓ అరడజను ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారనీ, ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగా రాగానే ఈ వలసలు ఉంటాయని బీఆర్ఓస్ వర్గాలే చెబుతున్నాయి.
వాస్తవానికి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, వచ్చిన వారిని వచ్చినట్లు చేర్చుకోవడం వెనుక నీవునేర్పిన విద్యయే నీరజాక్ష అన్న చిన్న రివెంజ్ ఉన్నప్పటికీ ..అంతకంటే కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అంటూ కేసీఆర్ ముఖ్య నేతలు చేసిన ప్రకటనలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
దానం నాగేందర్ తో మొదలై ఇప్పటి వరకూ విడతల వారీగా ఓ పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ టార్గెట్ మరో పదహారు మంది అని పరిశీలకులు చెబుతున్నారు. అంటే మొత్తం 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ గా పెట్టుకున్న రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని బీఆర్ఎస్ లోకి విలీనం చేసుకున్న చందంగానే ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రక్రియను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే పూర్తి చేయాలని భావించిన రేవంత్ ఆ దిశగా పావులు కదిపారు. అయితే కారణాలేమైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు అది జరగలేదు. ఇప్పుడు మళ్లీ మరోసారి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికకు తలుపులు తెరవడానికి రెడీ అయ్యారని అంటున్నారు. తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత రేవంత్ అదే పని మీద ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ కు ప్రాతినిథ్యం లేని గ్రేటర్ హైదరాబాద్, శివారు నియోజకవర్గాలపైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని అంటున్నారు. ఇప్పటికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. మరో అరడజను మంది కూడా అదే దారిలో ఉన్నారని అంటున్నారు. మరో పదిమందిపైనా రేవంత్ దృష్టి పెట్టారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ముఖ్యనాయకులు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి అవసరమైనంత మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టనున్నట్లు చెబుతున్నారు.
అయితే అలా వచ్చి చేరేవారికి మంత్రి పదవుల హామీ ఇవ్వలేనని రేవంత్ ముందుగానే చెప్పేస్తున్నారట. అయితే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కీలక రార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించేందుకు మాత్రం రేవంత్ సుముఖంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.