posted on Aug 13, 2024 11:40AM
కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ లో గత వారం పీజీ ట్రైనీ డాక్టర్ హత్యాచార సంఘటన దేశవ్యావ్తంగా సంచలనం రేపింది. ఇది మరో నిర్భయ ఘటనగా వైద్యులు, నర్సులు భగ్గు మంటున్నారు. ఆసుపత్రిలోనే వైద్యులకు రక్షణ లేకుండా పోతు న్నదని,తమకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా వైద్యులు ఈ దారుణ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్చారు. జూనియర్ వైద్యులు వైద్య సేవలను బంద్ చేసారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనను ఖండించడమే కాకుండా సత్వరమే కేసును పరిష్కరించి నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. అందులో రాష్ట్ర పోలీసులు విఫలమైతే కేసును సీబీఐకి అప్పగిస్తానని రాష్ట్ర పోలీసులను హెచ్చరించారు. ఈ సంఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. నిందితుడు సంజయ్ రాయ్ పోలీస్ విభాగంలో వాలంటీర్ గా పనిచే స్తున్నాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేసేవాడు. తరువాత పోలీసు సంక్షేమ విభాగానికి మారాడు. అతడు ఆసుపత్రి ఔట్ పోస్ట్ లో విధి నిర్వహిస్తున్నప్పుడు యువతులపై అనుచిత వ్యాఖ్యలు చేసేవాడని చెబుతున్నారు.అనేక అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు సైతం సంజయ్ రాయ్ పై ఉన్నాయి.అతడిని పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణకాండలో మరికొందరు కూడా ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అత్యాచారానికి ముందు ఆమెను నానారకాలుగా చిత్రహింసలకు గురి చేశారని ప్రథమికంగా నిర్ధారించారు. విధుల్లో ఉన్న ఆమెను చితకబాది అత్యా చారం చేసినట్లు మెడికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
కళ్లు,పెదవులు,చెవి,కడుపు, మర్మాంగాలులో గాయాలు న్నాయని మెడికల్ రిపోర్టు పేర్కొంది. తెల్ల వారుజామున మూడుగంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగిందని తెలుస్తున్నది. ఇప్పటివరకూ ఆధారాలు లభించలేదని,అటాప్సీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. నర్సులు ఉండగానే అత్యాచారం జరగడం,అత్యాచారం ఘటన సమయంలో మరికొందరు ఉన్నారని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణలు గమనార్హం. ముందుగా హత్యచేసి ఆపై అత్యాచారం చేసారని ప్రాధమిక నివేదికలో ఒక వైద్యుడు అభిప్రాయపడినట్లు తెలుస్తున్నది.
ఘటన జరిగిన రోజు ట్రైనీ డాక్టర్ నర్సులు తో కలిసి టీవీలో ఒలింపిక్స్ క్రీడలను చూశారనీ, ఆ తరువాత చదువుకోవడానికి ఆసుపత్రి సెమినార్ హాలులోకి వెళ్లారని నర్సులు చెబుతున్నారు. తెల్లవా రుజామున 3-6 గంటల మధ్య హత్యాచారం జరిగిందని చెబుతున్నారు. పశ్చిమబెంగాల్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని ఆమె సీఎంకు విజ్ఞప్తి చేసారు.