మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్ట్.. అగ్రీగోల్డ్ భూముల స్కాంలో కదిలిన డొంక! | acb arrest jogi ramesh son| rajeev| agrigold| lands
posted on Aug 13, 2024 11:35AM
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అగ్రీగోల్డ్ భూముల స్కాం కు సంబంధించి జోగి రమేష్ నివాసంలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు అనంతరం జోగి రమేష్ తనయుడిని అదుపులోనికి తీసుకుని విజయవాడ కార్యాలయానికి తరలించారు. అగ్రీగోల్డ్ వ్యవహారంలో భారీ స్కామ్ జరిగినట్లు గుర్తించిన ఏపీసీ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో సోదాలు నిర్వహించింది. అగ్రీగోల్డ్ వ్యవహారంలో జోగి రమేష్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా గతం నుంచీ కూడా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే జగన్ హయాంలో జోగి రమేష్ ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది. గురివింద గింజ సామెతలా.. తాను ఓ వైపు అక్రమాలకు పాల్పడుతూ, భూదందాలు, కబ్జాలకు పాల్పడుతూ.. అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న జోగి రమేష్ ఇప్పుడు అధికారం అండ చూసుకుని పాల్పడిన అక్రమాలకు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితుల్లో పడ్డారు.
అగ్రిగోల్డ్ భూములను సర్వే నెంబర్లు మార్చేసి మాజీ మంత్రి జోగి రమేష్ తన పలుకుబడితో తన కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను మార్చి, తన కుటుంబ సభ్యులపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అగ్రిగోల్డ్ బాధితులు చేసిన ఫిర్యాదులను నాటి జగన్ సర్కార్ బుట్టదాఖలు చేసింది. జగన్ కనుసన్నలలో మెలిగిన అధికారులెవరూ జోగి రమేష్ పై ఫిర్యాదులను స్వీకరించడానికి కూడా సాహసించలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. అగ్రిగోల్డ్ బాధితుల ఫిర్యాదులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తులో భాగంగానే అధికారులు ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు సంబంధించి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ పై ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ఆయనను అదుపులోనికి తీసుకుని విజవాడ ఏసీబీ రేంజ్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. మొత్తం మీద జోగి రమేష్ అక్రమాల పుట్ట పగిలినట్లేనని అంటున్నారు. జోగి రాజీవ్ తరువాతి వంతు జోగి రమేష్ దేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.