వైసీపీ నేతల్లో వణుకు.. నెక్ట్స్ జైలుకెళ్లేది వాళ్లేనా! | arrest fear in ycp leaders| next| who| kodali| jogu| vamshi
posted on Aug 14, 2024 9:24AM
వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు ఎవరు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందోనన్న ఆందోళన వారిలో నెలకొంది. తాజాగా మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నేడో రేపో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. మొత్తానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో హద్దులు మీరి ప్రవర్తించిన నేతలకు గట్టి గుణపాఠం చెప్పేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఎలాంటి హడావిడి లేకుండా చట్ట ప్రకారం వీరి అరెస్టుల విషయంలో ప్రభుత్వం ముందుకెళ్తుండటం గమనార్హం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయ్యింది. ఈ స్వల్ప కాలంలో సీఎం చంద్రబాబ నాయుడు రాష్ట్రంలో అభివృద్ధిని ఉరుకులు పెట్టిస్తున్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉండటంతో ప్రజలు సైతం ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ప్రస్తుతం చంద్రబాబు పాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ హయాంలో హద్దులు దాటి ప్రవర్తించిన నేతల అరెస్టుల వ్యవహారాన్ని ప్రజలు సమర్ధిస్తున్నారు.
వైసీపీ హయాంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన సాగించారు. రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించి ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వాళ్లను జైళ్లకు పంపించేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడునుసైతం అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. వైసీపీ ప్రభుత్వం తీరును ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు బనాయించడం, జైళ్లకు పంపించడమే పనిగా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. మరోవైపు చంద్రబాబు నాయుడు, లోకేశ్, పవన్ కల్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులపైనా వైసీపీ నేతలు ఇష్టారీతిగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సతీమణిని అసెంబ్లీ వేదికగా అవమానించారు. కక్షపూరిత పాలనతో పాటు రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేకపోవటంతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు వైసీపీని పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు తన అపార పాలనా అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఐదేళ్ల కాలంలో అదుపు తప్పిన శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చారు. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల ప్రతినిధులు ముందుకొచ్చేలా ప్రశాంత వాతావరణం నెలకొనేలా చేశారు. దీంతో చంద్రబాబు రెండు నెలల పాలన పట్ల అన్నివర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలపై కక్షపూరిత రాజకీయాలకు చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అందరూ భావించారు. కానీ, రాష్ట్ర అభివృద్ధే తమ మొదటి ప్రాధాన్యతగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ముందుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నేతలను, కార్యకర్తలను సముదాయిస్తూ రాష్ట్రంలో ఎక్కడా ఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం మంచితనాన్ని సాకుగా తీసుకొని పలువురు వైసీపీ నేతలు ఇంకా అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమేనన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలను చంపేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తమపై వైసీపీ నేతలు దాడులు కొనసాగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని సముదాయిస్తూనే రెచ్చిపోతున్న వైసీపీ నేతలపై కొరఢా ఝుళిపిస్తున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వం హయాంలో అవినీతి అక్రమాలు, భూదందాలకు పాల్పడిన వైసీపీ నేతలను చట్టపరంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలుఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు విచారణ జరుపుతున్నారు. వందలాది ఎకరాల భూములను పెద్దిరెడ్డి కబ్జాలకు పాల్పడ్డారని అధికారుల విచారణలో తేలింది. ఈ క్రమంలో త్వరలో పెద్దిరెడ్డి అరెస్టు ఖాయమని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్ పై ఇప్పటికే కేసు నమోదైంది. ఆయన్ను త్వరలోనే విచారించి అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ జోగి రమేష్ కు కోర్టులో ఊరట లభించలేదు. అలాగే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నిందితుడుగా ఉన్న వల్లభనేని వంశీ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయంలో జోగిరమేశ్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరి తరువాత ఎవరనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ తోపాటు పలువురు వైసీపీ నేతలు త్వరలో అరెస్టు అవ్వడం ఖాయమని వైసీపీ వర్గాలే అంటున్నారు. దీంతో ఎవరు ఎప్పుడు అరెస్టవుతారా అన్న భయం వైసీపీ నేతలలో వ్యక్తం అవుతోంది.