posted on Aug 14, 2024 11:01AM
విద్యాశాఖలో సమూల మార్పులు దిశగా తెలుగుదేశం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విద్యాశాఖపై మంగళవారం సమీక్ష నిర్వహించిన చంద్రబాబు పాఠశాల విద్యపై ప్రభుత్వం రూ.32 వేల కోట్లు ఖర్చుచేస్తోందనీ, ఇందుకు తగ్గట్టుగా ఫలితాలు కనిపించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందించాలని ఆదేశించారు. మారుతున్న కాలానికి అగుణంగా, భవిష్యత్ అవసరాలను దష్టిలో పెట్టుకుని సిలబస్ లో మార్పులు చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.
ఈ మార్పుల కోసం విద్యా రంగ నిపుణులు, మేధావులు, ఆయా రంగాల ప్రముఖలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వచ్చే 10 -20 ఏళ్లకు ఏమి అవసరమో గుర్తించి బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయనీ, ప్రచార ఆర్భాటంపై కాకుండా ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టాలని చెప్పారు.
విద్య ప్రతి ఒక్కరి హక్కు…బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదన్న చంద్రబాబు ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థలతో ప్రభుత్వ స్కూళ్లు పోటీ పడే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, విద్యార్థుల 100 శాతం ఎన్రోల్మెంట్ జరగాలని, గ్రాడ్యుయేషన్ వరకు మానిటరింగ్ ఉండాలని సూచించారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అక్కౌంట్ రిజిస్ట్రీ) ద్వారా ప్రతి విద్యార్ధికి ఐడీ ఇవ్వాలని అన్నారు.
ప్రైవేటు స్కూళ్లలో మాదిరిగా ప్రభుత్వ పాఠశాల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ లు పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. కర్నూలు జిల్లాలో వలస కార్మికుల పిల్లలు స్కూళ్లకు దూరం అవుతున్నారన్న సమాచారంపై వారందరినీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించి విద్యను అందించాలని సూచించారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద పెద్ద క్రీడా మైదానాలు ఉన్నాయని, వాటిని సద్వినయోగం చేసుకుని పిల్లలను క్రీడలవైపు ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ రిపోర్ట్స్ తో పాటు స్పోర్ట్స్ రిపోర్ట్స్ కార్డ్స్ కూడా ఇవ్వాలని అన్నారు. జీవో నెంబర్ 117పై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. స్కూళ్లలో ఇంగ్లీష్ తో పాటు మాతృభాష తెలుగుకు తగు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయని… పెద్ద సంఖ్యలో డ్రాపౌట్స్ పెరిగాయని ఆందోళన వ్యక్తంచేస్తూ… డ్రాపౌట్స్ అడ్డుకట్టపై దృష్టిపెట్టి సమస్యను పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ కూడా ఇవ్వాలని సిఎం అన్నారు. త్వరలో జన్మభూమి 2.0 కార్యక్రమం ప్రారంభిస్తున్నామని….ఆయా గ్రామాల్లో ఎవరైనా పాఠశాలలు అభివృద్ది చేయడానికి ముందుకు వస్తే వారిని ప్రోత్సహించాలని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో తీసుకువచ్చిన నూతన విధానాలు, సంస్కరణల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఒక క్లాసుకు ఒక టీచర్ అనే విధానం అమలుచేస్తున్నామని తెలిపారు. టీచర్లపై అనవసరపు ఒత్తిడి తేవడం వల్ల ఉపయోగం ఉండదని… అందుకే ఉపాధ్యాయులపై యాప్ ల భారం తగ్గించామని వివరించారు. ఇదే సమయంలో విద్యార్థులకు బోధన, నాణ్యత, సేవల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడడం లేదని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యా రంగం నిపుణులతో మాట్లాడి విద్యా శాఖలో నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అంతకు ముందు అధికారులు రాష్ట్ర విద్యాశాఖలో ప్రస్తుత పరిస్థితిని ప్రజంటేషన్ ద్వారా వివరించారు.