దువ్వాడ ‘ఆయనకిద్దరు’ స్టోరీలో కొత్త కేరెక్టర్ ఎంట్రీ! | duvvada srinivas house story| duvvada srinivas house| duvvada srinivas| duvvada vani
posted on Aug 14, 2024 6:07PM
దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్వెల మాధురి ప్రధాన పాత్రధారులైన డైలీ సీరియల్ ‘ఆయనకిద్దరు’లో కథ కొత్త ట్విస్ట్ తిరిగింది. తన ఆస్తి మొత్తం దువ్వాడ వాణికి, తన కూతుళ్ళకు ఇస్తానని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు. అయితే యమధర్మరాజు సావిత్రితో ‘అదియునూ పతి ప్రాణంబుదక్క’ అన్నట్టుగా, ‘నేను ఉంటున్నఇల్లు తప్ప’ అని దువ్వాడ శ్రీనివాస్ కండీషన్ పెడుతున్నారు. దువ్వాడ వాణి అండ్ డాటర్స్ ఆ ఇంటి బయటే సెటిలై నిరసన తెలియజేస్తున్నారు. తాను ఇంట్లోంచి బయటకి వెళ్తే దువ్వాడ వాణి ఇంటిని ఎక్కడ స్వాధీనం చేసుకుంటుందోననే భయంతో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గడప దాటి బయటకి రావడం లేదు. తనకెంతో ప్రియమైన, తనతో ‘అడల్ట్రీ’ సంబంధంలో వున్న దివ్వెల మాధురి ఉత్తిత్తి యాక్సిడెంట్‌కి గురైనా ఇంట్లోంచి బయటకి వెళ్ళకుండా ఫోన్ పరామర్శలతోనే సరిపెట్టారు. ఇప్పుడు కథలో కొత్త ట్విస్ట్ ఏమిటంటే, ఆ ఇల్లు దువ్వాడ శ్రీనివాస్‌ది కాదు.. నాది అంటూ కొత్త క్యారెక్టర్ కథలోకి వచ్చింది. ఆ కేరెక్టర్ పేరు చింతాడ పార్వతీశ్వరరావు.
దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు కట్టిన స్థలాన్ని చింతాడ పార్వతీశ్వరరావు దగ్గర కొన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ తనకు స్థలం తాలూకు ఇంకా 60 లక్షల రూపాయలు బాకీ వున్నారని, ఆ బాకీ నిమిత్తం ఇచ్చిన చెక్కులు క్లియర్ కాలేదని, అందువల్ల స్థలంతోపాటు, ఆ స్థలంలో వున్న ఇల్లు కూడా తనదేనని చింతాడ పార్వతీశ్వరరావు రంగంలోకి దిగారు. త్వరలో ఇంటిని తాను రికవరీ చేసుకోబోతున్నానని చింతాడ మహా పట్టుదలగా చెబుతున్నారు. ఈ ఆయనకిద్దరు స్టోరీలో ఇంకెన్ని ట్విస్టులు చూడాలో ఏంటో!