బొత్స మండలిలో ప్రతిపక్ష నేత? | botsa leader of opposition in mandali| vizag| local| bodies| quota| by| election
posted on Aug 16, 2024 6:40AM
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లే. కూటమి నుంచి అభ్యర్ధిని నిలుపకపోవడమే అందుకు కారణం. బొత్స ఎన్నిక కాగానే ఆయనను మండలిలో ప్రతిపక్ష నేత గా పార్టీ ప్రకటిస్తుందని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. బొత్స బలంగా మండలిలో తమ పార్టీ వాణిని వినిపిస్తారని జగన్ నమ్ముతున్నారు. మండలిలో వైసీపీ కి బలం ఎక్కువ గానే ఉంది. ప్రస్తుతం మండలిలె వైసీపీ పక్ష నేతగా అప్పిరెడ్డి వ్యవహరిస్తున్నారు. జగన్ కు అసెంబ్లీ కి వచ్చే ఆలోచన లేకపోవడానికి తనను ప్రతిపక్ష నేతగా స్పీకర్ అంగీకరించకపోవడం కూడా ఒర కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు.
అందుకే మండలిలో పార్టీ వాణిని గట్టిగా వినిపించేందుకు బొత్సను ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ ఎంపిక చేశారంటున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో మొత్తం 849 ఓట్లు ఉంటే వాటిలో కూటమికి 200 వరకూ ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవల వైసీపీ నుంచి చేరికలతో మరో వంద ఓట్లు కూటమికి దఖలు పడ్డాయని సమాచారం. ఇంకా వైసీపీకి ఐదు వందల పైగా ఓట్లు ఉన్నాయని, వారిని ఇప్పటికే వైసీపీ క్యాంప్ లకు తరలించింది. మాజీ సీఎం జగన్ వారితో మాట్లాడుతూ వేరే వారికి ఓటు వేసి తన పరువు తీయవద్దని విజ్ఞప్తి కూడా చేసారు. బొత్స అయితే గట్టి అభ్యర్థిగా పోటీ ఇస్తారని భావించారు.
అయితే బలం లేని చోట పోటీ చేయడం చంద్రబాబుకు ఇష్టం లేదు. అంతేకాక అధికారంలోకి వచ్చి రెండు నెలల్లో పోటీ చేసి ఓటమి పాలు కావడం కంటే, లేదా పెద్ద సంఖ్యలో వైసీపీ నుంచి స్ళానిక సంస్థల ప్రతినిధులను పార్టీలో చేర్చుకుని బరిలోకి దిగడం కంటే పోటీకి దూరంగా ఉండటమే మేలని చంద్రబాబు భావిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సామ దాన బేధ దండోపాయాల ద్వారా స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు మాత్రం అటువంటి అప్రజాస్వామిక విధానాలను అవలంబించడానికి ఇష్టపడటం లేదు. దీంతో విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీకి కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించారు.