posted on Aug 16, 2024 6:14PM
పలువురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వి.ఆర్.లో వుంచడం పట్ల మాజీ ఐపీఎస్ అధికారులు స్వర్ణజిత్‌సేన్, ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ చాలా బాధపడిపోతున్నారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న లోక్ సభ ఎంపీ రఘురామకృష్ణంరాజును టార్చర్ చేసి చట్టాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఐపీఎస్‌లను విఆర్‌లో పెట్టక నెత్తిన పెట్టుకుంటారా? గ్రూప్ వన్ పరీక్షల కుంభకోణంలో మెరిట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన ఐపీఎస్‌లను ఏం చేయాలి? ఇలాంటి తీవ్ర నేరారోపణలున్న వారిని సస్పెండ్ చేయాలి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వారిని కేవలం విఆర్‌లో మాత్రమే ఉంచింది. అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై అబద్దపు ఆరోపణలతో జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉన్నత న్యాయస్థానాల తీర్పును నీరుగార్చి ఆయనను ఐదేళ్లు సస్పెన్షన్‌లో ఉంచారు. జగన్ పాలనలో 15 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను, 170 మందికి పైగా అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, సీఐలను నెలలు, సంవత్సరాల తరబడి జగన్ విఆర్‌లో ఉంచారు. 15వ ర్యాంకులో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి డిజిపి పోస్టు కట్టబెట్టి మూడవ స్థానంలో ఉన్న ద్వారకా తిరుమలరావుకు అన్యాయం చేశారు. సీనియర్ ఐఏఎస్ ఎల్.వి.సుబ్రహ్మణ్యం గారిని అవమానకరంగా సిఎస్ పదవి నుండి తొలగించారు. ఈ దుర్మార్గాలు స్వర్ణజిత్ సేన్, ప్రవీణ్ కుమార్‌లకు కనిపించలేదా? ఆనాడు ఏబీ వెంకటేశ్వరరావు పట్ల జగన్ తీరును ఖండించి ఉంటే నేడు వారికి మాట్లాడే నైతిక హక్కు ఉండేది. వాళ్ళు అప్పుడు ఆ పని చేయలేదు కాబట్టి, ఇప్పుడు ఆవేదనపడిపోతున్నారు కాబట్టి వారిని జగన్ వత్తాసుదారులుగా భావించాలి.
జగన్ దురాగతాలకు బలైన ఉన్నతాధికారులు కొందరు…
1.అత్యంత నిబద్ధత కలిగిన ముద్దాడ రవిచంద్రని 2023 నుండి ఎన్నికలు అయ్యే వరకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టడం అరాచకం కాదా?
2. నీతిపరుడయిన శ్రీనివాస్, నరేష్‌లకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించడం అరాచకం కాదా?
3. 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన రాజమౌళి ఐఏఎస్‌ని 14 నెలలు వెయిటింగ్లో పెట్టి చివరి 7 రోజులు పోస్టింగ్ ఇచ్చి ఉత్తర్ ప్రదేశ్‌కి సాగనంపలేదా?
4. విజయసాయిరెడ్డిని హైదరాబాద్‌లో కలిసే వరకు సతీష్ చంద్ర ఐఏఎస్‌కు పోస్టింగ్ కూడా ఇవ్వకపోవడం అమానుషం కాదా?
5. కాంట్రాక్టర్ మధ్యవర్తిత్వం చేస్తే కానీ సాయి ప్రసాద్ ఐఏఎస్‌కు పోస్టింగ్ ఇవ్వని చర్యలు దారుణం కాదా?
6. అత్యంత నీతిపరులయిన బాలసుబ్రమణ్యం ఐపీఎస్, ఏబీ వెంకటేశ్వర రావు ఐపీఎస్ వంటి వారికి 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించడం అత్యంత దారుణం, ‘ఆటవికం’ కాదా?
7. శ్రీనివాసరాజు, 8. చెరుకూరి శ్రీధర్, 9. సి. నాగరాణి, 10. క్రిష్ణ కిశోర్, 11. టి. ఏ. త్రిపాఠి, 12. ఘట్టమనేని శ్రీనివాస్, 13.ఎస్. వి రాజశేఖర్ బాబు, 14. కోయ ప్రవీణ్, 15. భాస్కర్ భూషణ్, 16. లక్ష్మీ నారాయణ, 17.గంటా సుబ్బారావులపై వేధింపులు దారుణం కాదా?
ఇలా అనేకమంది నిబద్ధత కలిగిన మంచి ఉన్నతాధికారులను జగన్ ప్రభుత్వం వేధించి, హింసించినప్పుడు నీలి మీడియా ఎందుకు కళ్లు మూసుకుంది? పైగా ప్రభుత్వ దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా బలపరచలేదా? నేడు కళంకిత అధికారులను కేవలం వీఆర్‌లో పెడితే జగన్ ముఠా, నీలి మీడియా ఎందుకు భుజాలు తడుముకుంటోంది? జగన్ రెడ్డి నేరాలు, ఘోరాలు, దోపిడీలలో భాగస్వాములైనవారిని కాపాడుకోవటానికికాదా?