Leading News Portal in Telugu

తెలంగాణ మహిళలను దారుణంగా అవమానించిన కేటీఆర్! | ktr insults telangana women


posted on Aug 16, 2024 11:33AM

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎంత అహంకారంతో మాట్లాడతారో అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుని పోవడానికి ఆయన అహంకారం కూడా ఒక కారణం అనే విషయం అందరికీ తెలుసు.. ఒక్క కేటీఆర్‌కి తప్ప! ఇంత జరిగినా తనకు ఎంతమాత్రం అహంకారం లేదని చాలా అహంకారంతో కూడిన వాయిస్‌తో కేటీఆర్ చెబుతూ వుంటారు. ఇంత జరిగినా తన శైలిని మార్చుకోకుండా అహంకారపు మాటలు మాట్లాడుతూ వుంటారు. ఇంతకాలం ఆంధ్రావాళ్ళ మీద, కాంగ్రెస్, బీజీపీల మీద తన అహంకారం చూపించిన కేటీఆర్ ఇప్పుడు తన అహంకారాన్ని ఏకంగా తెలంగాణ మహిళల మీద ప్రదర్శించారు. తెలంగాణ మహిళలను చాలా దారుణంగా అవమానిస్తూ మాట్లాడారు. కేటీఆర్ తీరు పట్ల తెలంగాణ మహిళాలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్యూ ఎక్కడివరకూ వెళ్ళిందంటే, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది.

తెలంగాణ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం. రాష్ట్రంలోని మహిళల నుంచి ఈ నిర్ణయానికి మద్దతు లభిస్తోంది. మహిళలు బస్సుల్లో ప్రయాణించడం పెరిగిన నేపథ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడం సహజం. బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు ప్రయాణిస్తూనే కుట్లు, అల్లికల వంటి పనులు చేసుకోవడం అడపాదడపా కనిపిస్తోంది. ఇది తెలంగాణ మహిళలు బస్సులను ఎంత ఓన్ చేసుకున్నారన్నదానికి నిదర్శనం. ఇది సంతోషపడాల్సిన విషయమే తప్ప, ఇష్యూ చేయాల్సిన అంశం కాదు. అయితే ఈ విషయం కేటీఆర్‌కి ఎంతమాత్రం నచ్చలేదు. బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు కుట్లు, అల్లికలు చేసుకుంటున్నారని, అల్లం వెల్లుల్లి ఒలుచుకుంటున్నారని దీనివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందని అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. దానికి రాష్ట్ర మంత్రి సీతక్క స్పందించారు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మహిళలు అల్లం వెల్లుల్లి ఒలుచుకుంటే, కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.  అప్పుడు కేటీఆర్‌లోంచి అసలైన ఒరిజినల్ అహంకారం బయటకి వచ్చింది. ‘‘బస్సుల్లో కుట్లు, అల్లికలు మేం వద్దనడం లేదు. అవసరమైతే బ్రేక్ డ్యాన్స్.లు కూడా వేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

కేటీఆర్ చేసిన ఈ అహంకారపూరిత వ్యాఖ్యల మీద తెలంగాణలో మహిళాలోకం భగ్గుమంటోంది. ఈ అహంకార ధోరణినే కేటీఆర్ తగ్గించుకుంటే మంచిది అంటున్నారు. కొంతమంది మహిళలైతే, ఇలా అహంకార పూరితంగా మాట్లాడితే, ఇలా తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీస్తే కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణలో తిరగనివ్వం.. తెలంగాణ నుంచి తరిమికొడతాం అంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ అంటే మేం.. మేం అంటే తెలంగాణ అని డబ్బా కొట్టుకున్న కేసీఆర్ కుటుంబానికి ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది? కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. తెలంగాణ మహిళల పట్ల కేటీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకంగా వున్నట్టు మహిళా కమిషన్ అభిప్రాయపడింది. కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ మహిళలను కించపరిచేలా వున్నాయని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ళ శారద ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

తాను తెలంగాణ మహిళల మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర పరిణామాలకు దారి తీసిందని అర్థం చేసుకున్న కేటీఆర్ తాను తప్పు మాట్లాడానని ఒప్పుకోకుండా తెలివిగా కవర్ చేసే ప్రయత్నం చేశారు. ‘‘పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కాచెల్లెళ్ళను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’’ ఎక్స్.లో ఒక పోస్టు పెట్టారు. అయితే, అంతా అయిపోయిన తర్వాత ప్రకటిస్తున్న ఇలాంటి వినయాలు తెలంగాణ మహిళల ఆగ్రహాగ్నిని చల్లార్చే పరిస్థితి కనిపించడం లేదు.