Leading News Portal in Telugu

తెలంగాణ బీజేపీ.. ఈటల వర్సెస్ బండి! | telangana bjp etala versus bandi| party| state| president| internal


posted on Aug 18, 2024 9:08AM

తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలు ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా.. వర్గ పోరు కారణంగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కు అన్న చందంగానే తయారైంది. ముఖ్యంగా పార్టీలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు అధిష్ఠానాన్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. పాతవారిని సముదాయించలేక, కొత్తవారిని నియంత్రించలేక కమలం అధిష్ఠానం తలలు పట్టుకుంటోంది.

ఆ కారణంగానే సార్వత్రిక ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడి రెండు నెలలు దాటినా ఇంత వరకూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమౌతోంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటూ, రాష్ట్ర వ్యవహారాలను మేనేజ్ చేయడం కష్టం అనీ, రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామనీ బీజేపీ హైకమాండ్ చెప్పిన మాట ఇప్పటికీ ఆచరణలోకి రాకపోవడానికి పార్టీలో అంతర్గత విభేదాలే కారణం.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ముందున్న ఈటల రాజేందర్ కు ఆ పదవి రాకుండా బండి సంజయ్ అడ్డం పడు తున్నారని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. ఈటల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని ఒక్క బండి సంజ య్ మాత్రమే కాదు.. బీజేపీలోని కోర్ హిందూవాదులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ లాంటి సంస్థలు కూడా వ్యతి రేకిస్తున్నాయి. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సరిగ్గా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అనూహ్యంగా బండి సంజయ్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి కారణం ఈటల రాజేందర అన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇదే విషయాన్ని బండి సంజయ్ సహా తొలి నుంచీ బీజేపీలో ఉన్న నేతలు నమ్ముతున్నారు.  బండి అభిమానులు,   బీజేపీ కార్యకర్తలు, రాష్ట్రంలోని హిందూ వాదులు కూడా ఈటల కారణంగానే బండిని పార్టీ హైకమాండ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని భావిస్తున్నాయి. అప్పట్లో బండి వారసుడు ఈటలే అన్న వార్తలు కూడా గట్టిగా వినిపించినా బీజేపీ అధిష్ఠానం మధ్యే మార్గంగా కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.

దీంతో ఇప్పుడు ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్  సంజయ్  అడ్డంపడుతున్నట్టు తెలుస్తోంది. ఈటలకు రివెంజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు బండి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఈ ఇరువురి మధ్యా సయోధ్య కుదిర్చి ఈటలకు పదవి కట్టబెట్టడం ఎలా అని హైకమాండ్ తల పట్టుకుంటోంది. పరిస్థితి కరవమంటే కప్పకు కోపం… వదల మంటే పాముకు కోసం అన్నట్లుగా మారింది. ఈటలకు పదవి ఇస్తే బండి నొచ్చుకుంటాడు.. ఆయనతో పాటు కార్యకర్తలూ కాడె వదిలేస్తారు.  ఈటలను పక్కన పెడతామంటే ఆయన బీజేపీనే వదిలేస్తారని పార్టీ హైకమాండ్ భయపడుతోంది.  ఎందుకంటే ఈటల సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేత.. ఆయన అలిగి పార్టీ మారితే ఒక్కడిగా కాకుండా కొందరు తన వర్గం ఎమ్మెల్యేలనూ కూడా తన వెంట తీసుకుపోయే అవకాశం ఉంది. అలా ఈటల తనవర్గంతో కాంగ్రెస్ గూటికి చేరితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఆ భయం తోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో   బీజేపీ హైకమాండ్  ఎటూ తేల్చుకోలేక పోతోంది. 

 ఈటల రాజేందర్, బండి సంజయ్ ఈ ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారు.అంతే కాదు ఇద్దరిదీ భిన్నమైన రాజకీయ నేపథ్యం.   బండి సంజయ్ ది హిందుత్వ అజెండా. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ లలో చురుకుగా పని చేసిన నాయకుడు.  బీజేపీ కి క్రమశిక్షణ గల కార్యకర్త. బండికి ఉన్న ఫాలోయింగ్ ఓ జిల్లాకో, నియోజకవర్గానికో పరిమితం కాదు.   ఈటల విషయానికి వస్తే ఆయన రాజకీయ నేపథ్యం పూర్తిగా భిన్నమైనది. బీజేపీని గట్టిగా వ్యతిరేకించి, ఆ పార్టీ సిద్ధాంతాలను ఇసుమంతైనా నమ్మని కమ్యూనిస్టు భావజాలం ఈటలది. వాస్తవానికి  ఈటల రాజేందర్‌‌ బీఆర్ఎస్ ను వీడిన సమయంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరుతారనే అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ కారణంగానే ఆయనకు రాష్ట్ర బీజేపీ కోర్ లీడర్స్ తో అంతగా పొసగడం లేదు.  

తొలి నుంచీ బీజేపీలో ఉన్న పాతతరం నాయకులెవరూ ఈటలకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించవద్దనే అధిష్ఠానానికి చెబుతున్నారు. ఆయన నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేమని స్పష్టంగా చెబుతున్నారు.  ఈటలకు పార్టీ పగ్గాలు ఇస్తే రాజకీయంగా బీజేపీకి జరిగే మేలు కంటే పార్టీ సిద్ధాంతానికి జరిగే నష్టమే ఎక్కువ అని అంటున్నారు.  ఈ కారణంతోనే బండి సంజయ్ ద్వారా ఢిల్లీ స్థాయిలో ఈటలకు పదవి దక్కకుండా లాబియింగ్ చేస్తున్నారు. ఈ ఒత్తిడికి లొంగి బీజేపీ హై కమాండ్  ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఆయన పార్టీ వీడటం ఖాయం. అదే జరిగితే బలమైన సామాజిక వర్గం బీజేపీకి దూరం అవుతుంది. తెలంగాణలో మరింత బలోపేతమై భవిష్యత్ లో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ లక్ష్యానికి గండి పడుతుంది. పోనీ ఈటలకు అధ్యక్ష పదవి ఇద్దామా అంటే సొంత పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తి భగ్గుమంటుంది. ఈ కారణంగానే బీజేపీ అధిష్ఠానం ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పును వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది.