posted on Aug 19, 2024 12:31PM
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అవుతుందని ఫేక్ వార్తలు ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్టీవీ న్యూస్ నెట్‌వర్క్ సంస్థకు, రవి ప్రకాశ్‌కు బీఆర్‌ఎస్ పార్టీ లీగల్ నోటీసులు పంపింది.
ఐదు రోజుల్లోగా నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని, విలీనం వార్తలను ఆర్టీవీ నెట్ వర్క్ వెంటనే తొలిగించాలని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నది. లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటామని బీఆర్‌ఎస్ తన నోటీసుల్లో పేర్కొన్నది. గత పదేళ్ల నుంచి బీజేపీతో బీఆర్‌ఎస్ విభేదిస్తున్న విషయాన్ని నోటీసులో పేర్కొన్నది. కానీ ఆర్టీవీలో ప్రచారం చేసిన అసత్య ప్రచారంతో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ప్రభావితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అసత్య ప్రచారంతో బీఆర్‌ఎస్ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని తెలిపింది. బీఆర్‌ఎస్‌పై ఆర్టీవీలో ప్రచారం చేసిన అసత్య ప్రచారాలకు సంబంధించిన యూట్యూబ్ లింక్‌లను నోటీసుల్లో పేర్కొన్నది.
ఆర్టీవీ ప్రసారం చేసిన తర్వాతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్, బిజెపిలో విలీనం కానుందన్న వార్త నిజమేనన్నారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ కు గవర్నర్ పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లు చేసిన ప్రకటనతో బిఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఒక వేళ విలీనమైతే బిఆర్ఎస్ ఆస్తులు బిజెపికి ఇచ్చేయాల్సి ఉంటుందని కథనాలు వెలువడ్డాయి. అధికారమే పరమావధిగా పని చేస్తున్న కారు పార్టీకి ఫోర్త్ పిల్లర్ అయిన మీడియా పట్ల ఎలాంటి గౌరవం లేదని పలుమార్లు నిరూపించుకున్నారు. అలాగే కెసీఆర్ కు న్యాయవ్యవస్థ పట్ల కూడా నమ్మకం లేదు. సుప్రీం తీర్పులను డస్ట్ బిన్ లో పడేసి పాలన చేసిన బిఆర్ఎస్ ను ప్రజలు అథోపాతాళానికి తొక్కేశారు. అయినప్పటికీ కెసీఆర్ తన అహంకారాన్ని వీడటం లేదు.