posted on Aug 19, 2024 6:16PM
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సూళ్ళూరుపేట దగ్గర వున్న శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతాన్ని సందర్శించారు. శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, ఈ సంపద సంక్షేమానికి దోహదం చేస్తుందని చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.
“అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చొరవతో 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించాను. ఐటీ పరిశ్రమ భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పాను. గతంలో ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్ విధానంలో హైటెక్ సిటీ చేపట్టాను. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారు. ఇందులోని ప్రతి నలుగురిలో ఒక ఏపీ వ్యక్తి ఉంటారు. శ్రీసిటీలో 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీట్రేడ్ జోన్లు వచ్చాయి. 220 కంపెనీల ఏర్పాటుకు ఇక్కడ అవకాశం ఉంది. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ పరిశ్రమలు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 4 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడం చాలా గొప్ప విషయం” అని చంద్రబాబు అన్నారు.
‘‘చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీసిటీ దగ్గరగా వున్న శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా తయారు చేయాలనేది తన ఆలోచన అని చంద్రబాబు చెప్పారు. “శ్రీసిటీకి ఐ.జి.బి.సి. గోల్డెన్ రేటింగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నాం. పచ్చదనం కోసం వందశాతం వర్షం నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటాం. శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తాం. సహజంగా చల్లనివాతారవణం కల్పనకు చర్యలు తీసుకుంటాం. వీలైనంత వరకు ఉత్పత్తి, లాజిస్టిక్ ధరలు తగ్గించుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. పరిశ్రమలు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని కోరుతున్నా. 2029 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. విజన్ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. 2047 నాటికి ఒకటి లేదా రెండు స్థానాల్లో భారత్ నిలుస్తుంది” అని చంద్రబాబు అన్నారు.