posted on Aug 20, 2024 10:17AM
భాగ్యనగరం వర్ష బీభత్సానికి చిగురుటాకులా వణికి పోయింది. మంగళవారం (ఆగస్టు 20)తెల్లవారు జామునుంచి కొన్ని గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలను నీరు ముంచెత్తింది. దీంతో అవన్నీ చెరువులను తలపించాయి. ముఖ్యంగా పార్శీగుట్టలో వర్షం విలయాన్నే సృష్టించింది.
కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. నీటి ప్రవాహంలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు రావడంతో జనం భయంతో బెంబేలెత్తిపోయారు. పార్శీగుట్టలోని పలు ప్రాంతాలలో జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక నగరంలోని మిగిలిన ప్రాంతాలలో కూడా వర్షం జనజీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలో రోడ్లపై మోకాలి లోతున నీరు నిలిచింది. వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి పోయింది.
ఇక సోమవారం (ఆగస్టు 19) సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం నగరంలో జనజీవనాన్ని స్తంభింపచేసింది. సాయంత్రం వేళల్లో రద్దీగా ఉండే ప్రాంతాలలో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. నగరంలోని చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరో రెండు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా హైదరాబాద్, రంగారెడ్డిలలో మంగళవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ ప్రజలకు సూచించింది.