Leading News Portal in Telugu

విజయ్ పార్టీ జెండా ఆవిష్కరణ! | vijay party flag


posted on Aug 22, 2024 12:04PM

పవన్ కళ్యాణ్‌కి, తమిళ హీరో విజయ్‌కి కొన్ని విషయాలో పోలికలు వున్నాయి. విజయ్ నటించిన సినిమాలని పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేస్తూ నటించారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన తెలుగు సినిమాల తమిళ రీమేక్‌లలో కూడా విజయ్ నటించారు. అలా ఒకరి బాటలో మరొకరు పయనిస్తూ ఇద్దరూ సక్సెస్‌ఫుల్ హీరోలుగా ఎదిగారు. ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా పవన్ కళ్యాణ్‌ని విజయ్ ఫాలో అవుతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించిన తర్వాత కొన్నేళ్ళకు విజయ్ కూడా రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన ప్రకటన చేశారు. ‘తమిళగ వెట్రి కళగం’ అనే తన పార్టీ పేరును కూడా ప్రకటించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సక్సెస్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇది విజయ్‌లో ఉత్సాహాన్ని పెంచినట్టుంది. తాజాగా ఆయన తన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ పతాక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. విజయ్ పార్టీ జెండా ఎరుపు, పుసుపు రంగుల కలయికతో వుంది. జెండాపై రెండు ఏనుగులు వున్నాయి. ఈ సందర్భంగా విజయ్ తన పార్టీ కార్యకర్తలతో కలసి ప్రతిజ్ఞ చేశారు. ‘‘మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అసంఖ్యాక యోధులను మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. కులం, మతం, ప్రాంతం, లింగం పేరుతో వున్న వివక్షను మనం తొలగిస్తాం. ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమాన హక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తాం. సమానత్వం అనే   సూత్రాన్ని బలంగా సమర్థిస్తాం’’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. 2026లో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో విజయ్ పార్టీ పోటీ చేయబోతోంది.