posted on Aug 24, 2024 10:11AM
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైన తరువాత ఆ పార్టీ గమనం దశ, దిశ లేకుండా సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ అధినేత ఫామ్ హౌస్ కు పరిమితమైపోయారు. ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి క్యూకడుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, మరో మాజీ మంత్రి, సీనియర్ నేత హరీష్ రావులే పార్టీ గొంతుకగా మెలుగుతున్నారు. అయితే వారిరువురూ రేవంత్ సర్కార్ పై చేస్తున్న విమర్శలు చాలా వరకూ బూమరాంగ్ అవుతున్నాయి. ఎవరి పక్షాన అయితే తాము నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని చెబుతున్నారో ఆ రైతులే కేటీఆర్, హరీష్ ల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు బీఆర్ఎస్ రాష్ట్రంలో కనుమరుగు కాబోతోంది, ఆ పార్టీ బీజేపీ లేదా కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అంటూ బీజేపీ, కాంగ్రెస్ లు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పి కొట్టడంలో కేటీఆర్, హరీష్ లు విఫలమౌతున్నారు. అధికారంలో ఉండగా కృష్ణార్జునుల్లా చక్రం తిప్పిన వీరు విపక్షంలో మాత్రం తడడబుతున్నారు. విలీనం కథనాల నేపథ్యంలో పార్టీ ఉనికిని బలంగా చాటాలన్న తాపత్రయంలో దూకుడు పెంచుతున్నామంటూ వారు చేస్తున్న విన్యాసాలు ఇంత దిగజారుడుతనమేంటి అన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలుత హరీష్ రావు రేవంత్ పాపానికి తాను ప్రక్షాళన చేస్తున్నానంటూ దేవాలయాల యాత్ర మొదలు పెడితే, ఆ తరువాత కేటీఆర్ రేవంత్ ను ఉద్దేశించి చేసిన సవాల్ ఆయన స్థాయిని దిగజార్చింది.
మగాడివైతే సెక్యూరిటీ లేకుండా ఊళ్లల్లోకి రా అంటే కేటీఆర్ చేసిన సవాల్ దూకుడు ప్రదర్శనగా కాకుండా దిగజారి మాట్లాడటంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా నోటికి వచ్చినది మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూపాయి. రాష్ట్రంలో బిఆర్ఎస్ ఉనికి, అస్థిత్వం కోసం దూకుడుగా ముందుకు వెళ్లాలన్న తాపత్రయంతో కేసీఆర్, హరీష్ లు పార్టీకి మరింత నష్టం చేస్తున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.