posted on Aug 24, 2024 2:02PM
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్థానంలో కొత్త పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేసే పనిలో అధిష్టానం ఉంది. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో బలమైన ప్రతిపక్ష పాత్ర వహించిన కాంగ్రెస్ అధికారంలో వచ్చి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొత్త పిసిసి అధ్యక్ష పదవి అనివార్యమైంది. బీసీల్లో మంచి పేరు ఉన్న నేతను అధిష్టానం అన్వేషిస్తుంది. అధిష్టానికి ఆరుగురు పేర్లు వచ్చినప్పటికీ మధుయాష్కి పేరు ఫైనలైజ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
కొత్త టీపీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారంపై ఇప్పటికే పార్టీ అధిష్ఠానంతో రాష్ట్ర నాయకత్వం పలుమార్లు చర్చలు జరిపింది. పీసీసీ రేసులో ఆరుగురు నేతలు… మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ నేత మధు యాష్కీ నిలిచారు.
ఈ క్రమంలో… ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు బీసీ నాయకులను ఫైనల్ చేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మధు యాష్కీ, మహేశ్ కుమార్ లు ఫైనల్ రేసులో నిలిచారు. వీరిలో ఒకరిని పీసీసీ పదవి వరించనుంది.
పీసీసీ పదవి ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపా దాస్ మున్షీ హాజరయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ ప్రెసిడెంట్ ఎంపికపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆరుగురు పేర్ల నుంచి ఇద్దరిని ఎంపిక చేశారు. మంత్రివర్గ విస్తరణ అంశం కూడా చర్చకు వచ్చినప్పటికీ… దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.