Leading News Portal in Telugu

రామ్ మాధవ్ రీ ఎంట్రీ.. జమ్మూకాశ్మీర్ బీజేపీలో నయాజోష్! | rammadhav re entry| jammu and kashmir| bjp| naya| josh| elections| three


posted on Aug 24, 2024 12:33PM

వారణాసి రామ్ మాధవ్.. రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న వారెవరికీ ఈ పేరును పరిచయం చేయనవసరం లేదు.   కొద్ది కాలమైనా సరే జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి కాగలిగిందంటే అందుకు కర్త, కర్మ, క్రియా అన్నీ రామమాదవ్ మాత్రమే. అటువంటి రామ మాధవ్ గత కొంత కాలంగా రాజకీయాలలో కలికానిక్కూడా కనిపించకుండా కనుమరుగయ్యారు. అందుకు కారణాలేమిటన్నది పక్కన పెడతే..  రామ్ మాధవ్ ను పక్కన పెట్టిన బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు అన్యధా శరణం నాస్తి అన్నట్లుగా ఆయననే ఏరి కోరి తెచ్చచుకుని జమ్మూకాశ్మీర్ బాధ్యతలు అప్పగించింది. 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే చదువుకుని బీజేపీ వంటి పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగిన రామ్ మాధవ్ ఆ పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ హోల్ టైమర్ గా ఉన్న రామ్ మాధవ్ ను బీజేపీ ఏరి కోరి పార్టీలోకి తెచ్చుకుని ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టింది. అంతేనా అత్యంత కీలకమైన జమ్మూ  కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల బాధ్యతలు అప్పగించింది. ఆ బాధ్యతలను రామ్ మాధవ్ చిత్తశుద్ధితో, నిజాయితీగా నిర్వహించారు. ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం రామ్ మాధవ్ నైజం. ఆ కారణంగానే ఆయన బీజేపీలో వేగంగా ఎదిగినా, అంత కంటే వేగంగా కనుమరుగవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 

2014 తర్వాత ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన రామ్ మాధవ్  పార్టీ ప్రధాన కార్యదర్శిగా,  ఈశాన్య రాష్ట్రాలు,  జమ్మూకశ్మీర్ ఇన్ చార్జిగా బాధ్యతలు చేపట్టి వాటికి పూర్తి న్యాయం చేశారు. తాను ఇన్ చార్జిగా ఉన్న రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యేలా ఆయా రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేశారు. ఎన్నికలలో విజయానికి అవసరమైన వ్యూహాలను పక్కాగా రచించి అమలు చేశారు. 

ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో  బీజేపీ, పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో రామమాధవ్ ది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. అయితే 2019 ఎన్నికలలో  బీజేపీ సొంతంగా ప్రభుత్వం చేపట్టేందుకు అవసరమైన స్థానాలలో విజయం సాధించే అవకాశం లేదనీ, భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పదనీ ఆయన చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. ఆ ఎన్నికలలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. అయినా భాగస్వామ్య పక్షాలతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనుకోండి అది వేరే సంగతి. కానీ బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చే అవకాశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఆయన ఎదుగుదలకు అడ్డంకిగా మారాయి. అమిత్ షా తరువాత పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా  అయనను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో రామ్ మాధవ్ ఐదేళ్ల పాటు రాజకీయంగా కనుమరుగైపోయారు. ఇప్పుడు అంటే 2024 ఎన్నికలలో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. పూర్తిగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే అత్యంత కీలకమైన జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను ఎదుర్కోవలసిన పరిస్థితిలో ఉంది. దీంతో బీజేపీకి మళ్లీ రామ్ మాధవ్ అవసరం ఏర్పడింది. మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోని బీజేపీ లీడర్, క్యాడర్ కూడా రాష్ట్రంలో బీజేపీ బలంగా పోరాడాలంటే రామ్ మాధవ్ రావాల్సిందేనని బలంగా చెబుతున్నారు. దీంతో అనివార్యంగా బీజేపీ అగ్రనాయకత్వం రామ్ మాధవ్ ను ఆర్ఎస్ఎస్ నుంచి మళ్లీ బీజేపీలోకి తెచ్చుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా జమ్మూ కాశ్మీర్ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించింది. జమ్మూ కశ్మీర్‌లో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 18న తొలి దశ, 25న రెండోదశ, అక్టోబర్‌ ఒకటిన మూడో దశ ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్‌ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.