posted on Aug 26, 2024 11:11AM
ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ తెలుగుదేశం గూటకి చేరనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తున్నది. బాబుమోహన్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆదివారం (ఆగస్టు 25) ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన ఫొటో సెషన్ లో చంద్రబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా బాబూ మోహన్ కూడా ట్రస్ట్ భవన్ కు వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తెలుగుదేశంతో తనకు గల అనుబంధాన్ని నెమరు వేసుకున్న బాబూ మోహన్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు.
బాబూ మోహన్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి చంద్రబాబును కలవడంతో ఆయన తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన బాబూమోహన్ ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందు కేఏపాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీ గూటికి చేరిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆయన ఆ పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బాబూ మోహన్ గతంలో తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత తెలుగుదేశం ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఆ తరువాత టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఇటీవలి ఎన్నికల ముందు ప్రజాశాంతి గూటికి చేరారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి అంటే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.