posted on Aug 28, 2024 6:27PM
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఐదున్నర నెలల తర్వాత ఆమె హైద్రాబాద్ కు చేరుకోవడంతో బిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాతం పలికాయి. కవితపై పూలవర్షం కురిపించారు. నవ్వుతూ ఆమె అభిమానులకు అభివాదం చేశారు.
ఆమె వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అన్నయ్య కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, భర్త అనిల్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. శంషాబాద్ నుంచి కవిత నేరుగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. తొలుత తండ్రి కెసీఆర్ దగ్గరికి వెళ్లాలని భావించిన్పటికీ జైలు నుంచి నేరుగా వెళ్లడాన్ని శాస్త్రం తప్పుపడుతుందని తెల్సుకుని తన ఇంటికే బయలు దేరారు. గురువారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ చేరుకొని తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలవనున్నారు. కెసీఆర్ గారాల పట్టీ కవిత తండ్రితో సమావేశం ఆసక్తికరంగా మారనుంది. ఐదున్నర నెలలు జైల్లో ఉన్నప్పటికీ తండ్రి ఒక్కసారి కూడా పరామర్శించకపోవడం చర్చకు దారి తీసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత ఈడీ మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మార్చి 26న కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అప్పటి నుంచి జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత బెయిల్ ఉత్తర్వు కాపీలను న్యాయవాదులు తిహార్ జైలు అధికారులకు అందించారు. అనంతరం కవిత జైలు నుంచి విడుదలయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.