Leading News Portal in Telugu

రోజురోజుకూ పెరుగుతున్న జంపింగ్ ల జాబితా.. వైసీపీ ఇక ఎంప్టీయేనా? | ycp rajyasabha members| mlcs| leaving| party| jagan| foriegn| tour| cadre


posted on Aug 31, 2024 8:38AM

వైసీపీలో సంక్షోభం తార స్థాయికి చేరింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు ముందు ఆ పార్టీలో అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. మరో వైపు ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో స్వయంగా జగన్ కే నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. పోలీసుల నోటీసు స్వీకరించి విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్ కు హాజరవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించక తప్పదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటన ఉంటుందా? రద్దు అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్న సమయంలో  ఆయన కుమార్తె పుట్టిన రోజు వేడుకల కోసం విదేశాలకు వెళ్లడం ఏమిటని సొంత పార్టీ నేతలే అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పోతే వైసీపీ రాజ్యసభ సభ్యులలో అత్యధికులు పార్టీనీ వీడడానికి రెడీ అయిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం  జరుగుతోంది. సాధారణంగా అయితే ఆ ప్రచారాన్ని పార్టీ ఖండించాలి. లేదా పార్టీ మారిపోతున్నారంటూ పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కనీసం వారైనా అటువంటిదేమీ లేదనీ, తాము పార్టీలోనే కొనసాగుతామని మీడియా ముందుకు వచ్చి చెప్పాలి. కానీ వైసీపీ నుంచి కానీ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల నుంచి కానీ అటువంటి ఖండనలేవీ రాలేదు. ఒక్క విజయసాయి రెడ్డి మాత్రం ట్విట్టర్ వేదికగా అటువంటి ఖండన ఒకటి చేశారు. అయితే ఆయన అలా ఖండించడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. యన తన ఖండన ద్వారా సొంత పార్టీ శ్రేణులలోనే జగన్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? లేక పార్టీ మారిపోతున్నారా అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా చేశాయి. ఎందుకంటే ఆయన గోడ దూకేస్తున్నారన్న ప్రచారం అంత వరకూ లేదు. విజయసాయి, సుబ్బారెడ్డి వినా వైసీపీ రాజ్యసభ సభ్యులలో ఇంకెవరూ మిగలరన్న ప్రచారమే విస్తృతంగా జరుగుతోంది. అటువంటి సమయంలో తాను పార్టీ మారే ప్రశక్తే లేదంటూ విజయసాయి ట్విట్టర్ వేదికగా ప్రకటించడం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఆ సంగతి అలా ఉంచితే.. 

పార్టీ అధిష్ఠానం ఎంపీలకు తాఖీదు పంపింది. పార్టీ మార్పు వార్తలను పార్టీ కార్యాలయానికి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఖండించాలని ఆదేశించింది. జగన్ హయాంలో పాలన బ్రహ్మాండంగా సాగిందనీ, ప్రజా సేవలో తామంతా తరించామని చెప్పాలన్నది ఆ ఆదేశాల సారాంశం.  

ఆ తాఖీదు అందుకున్న తరువాత  ఒక్క పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రమే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి తాడేపల్లికి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తాను పార్టీ మారే ప్రశక్తే లేదని చెప్పారు. అయితే ఆయన ఖండనను సొంత పార్టీ వారే నమ్మడం లేదు. అలాగే మరో  రాజ్యసభ సభ్యుడు కూడా హైదరాబాద్ లోనే మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ తాను పార్టీ మారే ఉద్దేశంలో లేనని చెప్పుకున్నారు. ఆయనను కూడా ఎవరూ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన పార్టీలను ఎలా మారుస్తారో అందరికీ తెలుసు. అసలు ఆయన వైసీపీలో చేరిందే రాజ్యసభ సభ్యత్వం కోసం అని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  వీరు వినా మరెవరూ తమ పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు. అంటే వారంతా తాము వైసీపీని వీడుతున్నామని ధృవీకరించేసినట్లే. 

వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఇప్పటికే ఇద్దరు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేసేశారు. వారి రాజీనామాలను రాజ్యసభ చైర్మన్ ఆమోదించేశారు. అంటే ఇక వైసీపీకి రాజ్యసభలో మిగిలిన సభ్యులు తొమ్మిది మంది.   వీరిలోనూ పలువురు రాజీనామా బాటలోనే ఉన్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలను పట్టించుకోకుండా  తమ పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించని వాంతా మారిపోవడం ఖాయమనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సరే రాజ్యసభ సభ్యుల విషయం అలా ఉండగా పార్టీ ఎమ్మెల్సీలు కూడా రాజీనామాల బాట పడుతున్నారు.  కర్రి పద్మ, బల్లి కల్యాణ్ చక్రవర్తి శుక్రవారం (ఆగస్టు 30)న రాజీనామాలు చేశారు. మరికొందరు   టీడీపీతో టచ్ లో ఉన్నారు.  వైసీపీ అధిష్ఠానానికి అందుబాటులోకి రావడం లేదు. దీంతో మండలి సభ్యులలో ఎంత మంది వైసీపీలో ఉంటారు? ఎందరు గోడ దూకేస్తారు అన్న విషయంలో క్లారిటీ లేదు.   

పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ 3 నుంచి 25వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. ఆ సమయంలోనే పార్టీ మారేందుకు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రంగం సిద్దం చేసుకుంటున్నారు. మొత్తం మీద వైసీపీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, జగన్ విదేశీ పర్యటనకు ఇలా బయలు దేరగానే అలా పార్టీ చాలా వరకూ ఖాళీ అయిపోతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.