Leading News Portal in Telugu

ప్రజల ప్రాణాలు కాపాడిన చింతమనేని! | chintamaneni help to people| chintamaneni


posted on Sep 1, 2024 8:56PM

దెందులూరు నియోజకవర్గ పరిధిలో వున్న రామిలేరు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో పొంగి పొర్లింది. ముంచుకొస్తున్న వరద ముప్పు నుంచి ప్రజలను కాపాడటానికి అర్థరాత్రి 2 గంటలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా రంగంలోకి దిగారు. ‘‘అమ్మా వరద వచ్చేస్తోంది. నిద్ర లేవండి… నేను పడవలు తెప్పిస్తాను…. ఈలోగా డాబాల పైకి వెళ్ళండి’’  అని చింతమనేని ప్రభాకర్ రామిలేరువాగు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. తాళ్ళమూడి సహా పలు గ్రామాల్లోకి వరద నీరు ముంచెత్తుతుండటంతో నిద్ర మత్తులో ఉన్న ప్రజలను వరద గురించి హెచ్చరిస్తూ చింతమనేని ప్రభాకర్ స్వయంగా అప్రమత్తం చేసారు. ఇతర గ్రామస్తులు సైతం ప్రజలను అప్రమత్తం చేసేలా సూచించారు. ఎమ్మెల్యే చింతమనేని హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తమై తమ ఇంటి డాబాలపైకి చేరుకున్నారు. ఈలోగా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వీతో ఫోన్లో మాట్లాడిన చింతమనేని రామిలేరు వాగు వరద తీవ్రతను వివరించారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తక్షణమే అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  దిగువన ఉన్న లాకులు తెరవటం వంటి సత్వర చర్యల ద్వారా వరద ప్రవాహ తీవ్రతను జనావాసాల వైపు తగ్గించేలా చర్యలు చేపట్టాలని, పడవల ద్వారా లోతట్టు ప్రాంతాల్లో వున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కలక్టర్ ఆదేశాలతో పలు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.