ప్రకాశం బ్యారేజీకి స్వల్ప డ్యామేజీ.. కోట్టుకు వచ్చిన బోట్ల వెనుక కుట్ర కోణం!? | conspiracy behind boats hitting prakasham barriagr gate| little| famage| officials| investigate| record| flood
posted on Sep 2, 2024 11:42AM
కృష్ణా నదికి చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ వరద వచ్చింది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. అధికారులు అనుక్షణం నీటి ప్రవాహాన్ని గమనిస్తూ, గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులు తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎగువ నుంచి ఇసుక బోటు వచ్చి 60వ గేటును ఢీకొంది. దీంతో స్వల్పంగా డ్యామేజీ జరిగింది. వరద ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో బోటు ఎలా వచ్చిందని అధికారులు పరిశీలిస్తుండగానే మరో నాలుగు బోట్లు కొట్టుకు రావడంతో దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవి ప్రమాదవశాత్తూ కొట్టుకువచ్చాయా లేక ఎవరైనా కావాలని బోట్లను వదిలారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో చంద్రబాబు నివాసానికి ముప్పు వాటిల్లే విధంగా బోటు అడ్డుతగిలిందని అప్పటి వైసీపీ ప్రభుత్వం నీటి ప్రవాహాన్ని పెంచేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలను ఈ సందర్భంగా స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అధికారులు సైతం బోట్లు కొట్టుకురావడం వెనక ఏదైనా కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న చంద్రబాబును విలేకరులు అడిగితే.. అవన్నీ తరువాత ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడను, ముందు బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలి. అని సమాధానం ఇచ్చారు. ఇలా ఉండగా బోట్లు కొట్టుకు వచ్చిన సంఘటనపై ఇరిగేషన్, రివర్ కన్జర్వేటివ్ శాఖల అధికారులు విచారణ జరుపుతున్నారు.
కృష్ణానది చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీగా వరద వచ్చింది. ఇంకా వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండటంతో వరద తగ్గుముఖం పట్టే వరకూ విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై రాకపోకలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. కనీ వినీ ఎరగని స్థాయిలో కృష్ణానది వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. చరిత్రలోనే తొలిసారిగా ప్రకాశం బ్యారేజీకి బ్యారేజీకి 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద వచ్చింది. గతంలో 1903వ సంవత్సరంలో 10.60 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత 2009 అక్టోబర్ లో 10.94 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు.
ఇప్పుడు ఆ రికార్డులన్నిటినీ తిరగరాస్తూ 11.20 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని అధికారులు వివరించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 23.6 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ఇది ఇంకా పెరిగితే బ్యారేజీ పై నుంచి వరద పారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ కారణంగా బ్యారేజీపై నుంచి రాకపోకలు నిలిపివేసే యోచన చేశారు. ఇప్పటికే బ్యారేజీ దిగువన పలు గ్రామాలు నీటమునిగాయి. గేట్లను పూర్తిగా పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.