మాజీ మంత్రి రోజా మారరా.. దేవుని సన్నిధిలో అదేం తీరు?! | roja lies on tirumala hills| ycp| cadre| angry| people| criticize| nochange| even| after| humiliating
posted on Sep 2, 2024 2:58PM
ఏపీలో అధికారం కోల్పోయిన తరువాతకూడా వైసీపీ నేతల ప్రవర్తన కుక్కతోక వంకర అనే చందంగానే ఉంది. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో జగన్, ఆయన బ్యాచ్ ప్రజలకు నరకం చూపించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన సాగించారు. దీంతో ప్రజలు వైసీపీకి ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. ప్రతిపక్ష హోదాకూడా ఇవ్వకుండా కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేశారు. ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పై బూతులతో రెచ్చిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజాలు రాజకీయాల్లో పూర్తిగా ఇన్ యాక్టివ్ అయ్యారు. వీరిలో రోజా వైసీపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాలకు వీడ్కోలు పలికి తమిళ రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీ ఇవ్వబోతున్నారని వైసీపీ శ్రేణుల్లోనే విస్తృత చర్చ జరుగుతోంది. రోజా ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెబుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ప్రచారం పట్ల వైసీపీ శ్రేణుల్లోనూ హర్షం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే.. వైసీపీ దారుణంగా ఓడిపోవటానికి అధికారంలో ఉన్న సమయంలో రోజా ప్రవర్తించిన తీరుకూడా ఓ కారణమని ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా రోజా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అంశంపై నోరు విప్పారు. తాను ఏపీ రాజకీయాల్లోనే ఉంటానని, వైసీపీలోనే కొనసాగుతానని చెప్పారు. అయితే వైసీపీ శ్రేణులు మరీ ముఖ్యంగా నగరి నియోజకవర్గ పార్టీ వర్గాలు రోజా వైసీపీని వీడితేనే బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత రోజా మాట తీరులో మార్పు వస్తుందని అందరూ భావించారు. కానీ, ఆమె మాటతీరులోనూ, ప్రవర్తనలోనూ ఇసుమంతైనా మార్పు రాలేదు. ఏ రాజకీయ పార్టీ నేతలైనా ఎన్నికల్లో ఓడిపోతే.. ఓటమికి కారణాలు సమీక్షించుకుంటారు. ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఓటమికి కారణాలు ఏమిటి? ఏ మండలంలో.. ఏ గ్రామంలో తనకు ఓట్లు తక్కువగా పోలయ్యాయి. కారణాలు ఏమిటి.. అనే విషయాలపై తమ అనుచరులతో సమావేశమై సమీక్షించుకుంటారు. మరోసారి అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతూ రాజకీయాల్లో ముందుకెళ్తారు. కానీ రోజా స్టైలే వేరు. వైసీపీ ఓటమిని ఈవీఎంలపై నెట్టేశారు. ఈ వీఎంలలో ఏదో మతలబు జరిగింది.. అందుకే వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో వైసీపీకి ఆదరణ ఉంది.. సునామీలా పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలకు కారణమేంటన్నది త్వరలోనే బయటకు వస్తుందంటూ వ్యాఖ్యానించడం ద్వారా వైసీపీ ఓటమి ప్రజలు ఇచ్చిన తీర్పుకాదనే అర్థం వచ్చేలా రోజా మాట్లాడారు. అంటే.. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150కిపైగా సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు సూపర్ అంటూ పేర్కొన్న రోజాకు.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి మాత్రం ఈవీఎంలపై నెపం నెట్టేస్తున్నారు. రోజా చేసిన ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ శ్రేణులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు బూతులతో పార్టీ పరువు తీసిన రోజా.. ఎన్నికలైన రెండు నెలల తరువాత మీడియా ముందుకొచ్చి అడ్డగోలుగా నోరు పారేసుకోవటం పట్ల ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ అధికారంలోఉన్న సమయంలో నెలలో అనేకసార్లు మంత్రి హోదాలో రోజా తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లేవారు. వెళ్తూవెళ్తూ ఆమెతో పాటు అనేక మందిని వెంటపెట్టుకొని వెళ్లేవారు. ఈ క్రమంలో ఆమె తిరుమల టికెట్లు అమ్ముకొని పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి. ఆమె తిరుపతి వెళ్లిన సమయంలో తిరుమల కొండపైనే అసత్యాలు, తప్పుడు ఆరోపణలతో తెలుగుదేశం, జనసేన పార్టీలపై రాజకీయ విమర్శలు చేసేవారు. అప్పట్లో రోజా తీరు పట్ల వైసీపీ నేతలు సైతం అభ్యంతరం తెలిపారు. కానీ, వైఎస్ జగన్ అండదండలు పుష్కలంగా ఉండటంతో రోజా తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోయారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత తొలిసారి శనివారం రోజా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. కొండపైనే రాజకీయ విమర్శలు చేశారు. ఆమె ఏమైనా నిజాలు చెప్పారా అంటే.. దేవున్ని దర్శించుకొనివచ్చి కొండపైనే పచ్చిఅబద్దాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో నేరాలు పెరిగాయి.. మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు పెరిగాయంటూ కూటమి ప్రభత్వంపై విషం కక్కారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండునెలలే అయ్యింది. వైసీపీ గత ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనతో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. కానీ, రోజా మాత్రం.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆడ పిల్లలు సేఫ్ గా ఉన్నారు.. కూటమి హయాంలో ఆడవాళ్లు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని తిరుమలేశుని సాక్షిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు ఘటనపైనా రోజా మాట్లాడారు.
వైసీపీ హయాంలో వేలాది మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు. అనేక మందిపై అఘాయిత్యాలు, హత్యలు జరిగాయి. కానీ, రోజా మాత్రం జగన్ హయాంలో ఒక్క మహిళపైనా దాడి జరగలేదు.. రెండు నెలల్లోనే ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యా ఘటనలు పెరిగాయంటూ తిరుమల కొండపైనే అబద్దాలు చెప్పడం చూసి వైసీపీ శ్రేణులుసైతం ఆశ్చర్యపోతున్నాయి. వాస్తవానికి వైసీపీ ఐదేళ్ల హయాంలో నేరాల సంఖ్య ఎక్కువగానే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో నివేదికను పరిశీలిస్తే.. వైసీపీ హయాంలో అబలలపై రోజుకు 49 అఘాయిత్యాలు చొప్పున జరిగాయి. 2021లో 17,752 నేరాలు జరిగాయి. ఇందులో 1,204 మంది మహిళపై అత్యాచారం జరగ్గా.. వారిలో 614 మంది బాలికలే. వైసీపీలో అధికారంలో ఉన్నన్ని రోజులు క్రైం రేటు ఎక్కువగానే ఉంది. కానీ, రోజా మాత్రం దిశా యాప్ తో మహిళల జోలికివచ్చేవారిలో భయం పుట్టించామంటూ తిరుమల కొండపైనే సినిమా డైలాగ్ తరహాలో చెప్పారు. అధికారంలో ఉన్న సమయంలో తన తీరుతో ప్రజల్లో వైసీపీ ప్రతిష్టను దిగజార్చిన రోజా.. మళ్లీ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతుండటంతో వైసీపీ శ్రేణులు తలపట్టుకుంటున్నారట. వైసీపీని, ఏపీ రాజకీయాలను వీడి రోజా తమిళ రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ వైసీపీలో ఉన్నా.. ఆమె నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేలా వైసీపీ అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇవ్వాలని, లేకుంటే ప్రజల్లో పార్టీపై ఉన్న కాస్త ఆదరణ కూడా పోతుందని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
మొత్తం మీద తిరుమలేశుని కొండపై ఆమె అవాస్తవాలు నిస్సంకోచంగా, నిర్భయంగా మాట్లాడేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘోర పరాజయం తరువాత కూడా ఆమె తీరు ఇసుమంతైనా మారలేదని పరిశీలకులు అంటున్నారు. గత రెండు నెలలుగా పూర్తి స్థాయిగా ఏపీ రాజకీయాలకు దూరంగా ఉన్న రోజా ఇప్పుడు మళ్లీ ఇలా ఎంట్రీ ఇచ్చి గతంలోలా రెచ్చపోవడానికి కారణం ఆమె తమిళనాట పొలిటికల్ ఎంట్రీకి ద్వారాలు మూసుకుపోవడమే కారణమని అంటున్నారు. దాంతో రోజా అనివార్యంగా ఏపీ పాలిటిక్స్ లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడటమే కాక, వైసీపీ వినా మరో పార్టీలోకి వెళ్లే అవకాశాలు లేకపోవడంతో రోజా వైసీపీని పట్టుకు వెళాడక తప్పడం లేదని చెబుతున్నారు.