గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి | flood water increasing in godavari| bhadrachalam| dhawaleswaram| near| 1st| danger
posted on Sep 4, 2024 10:31AM
ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి పగబట్టిందా? అన్నట్లుగా వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. ఓ వైపు మహోధృతంగా ప్రవహించిన కృష్ణా నది శాంతించి వరద తగ్గుముఖం పడుతుంటే మరో వైపు గోదావరికి వరద ఉదృతి పెరుగుతోంది.
కృష్ణా నది వరదలు తగ్గుముఖం పడుతున్నాయని ఆనందించచే లోపే గోదావరి వదర ముప్పు తరుముకు వస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద గంటగంటకూ ప్రవాహ ఉధృతి పెరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అంటే బుధవారం (సెప్టెంబర్ 4) భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.2 అడుగులు ఉంది. ఇక్కడ నీటిమట్టం 43 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
ఇక ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఇక్కడ ప్రవాహ ఉధృతి ఆందోళనకలిగిస్తోంది. ఇక్కడ ఇన్ ఫ్లో 3.05 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3.12 క్యూసెక్కులు గా ఉంది. గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లను విపత్తుల నిర్వహణ శాఖ అలెర్ట్ చేసింది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది.