కాశ్మీర్ ఎన్నికలు.. కత్తిమీద సామే! | jammu kashmir elections a big challenge to election commission| terrorisim| separatism| violence| pakisthan| effect
posted on Sep 4, 2024 12:11PM
జమ్మూ కాశ్మీర్ అనగానే ఉగ్రవాదుల హింసాకాండ, ఎన్ కౌంటర్లు, కాల్పులు, బాంబు దాడులు, చొరబాట్లు, సీమాంతర ఉగ్రవాదం గుర్తుకు వస్తాయి. అటువంటి రాష్ట్రంలో పదేళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఎన్నికల ఎర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. పదేళ్ల తరువాత తొలి సారిగా జమ్మూ కాశ్మీర్ లో జరగనున్న ఎన్నికల పట్ల దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొని ఉంది. చివరిసారిగా ప్రజాలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్లు కావస్తోంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలలో తొలి దశ నామినేషన్ల పర్వానికి చివరి రోజున దాదాపు 280 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, రెండో దశ పోలింగ్ సెప్టెంబర్ 25న, తుది దశ పోలింగ్ అక్టోబర్ 1న జరుగుతుంది. తొలి దశ ఎన్నికల ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీచేస్తుండడం, ఆయా అభ్యర్థులనామినేషన్ పత్రాలను దాఖలు కార్యక్రమానికి వేల సంఖ్యలో మద్దతు దారులు తరలి రావడాన్ని బట్టి ఎన్నికల పట్ల ప్రజలు ఎంత ఆత్రతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నది అవగతమౌతుంది.
మహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పి.డి.పి) ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతును ఉపసంహరించే వరకూ, అంటే 2018 వరకూ ఇక్కడ ప్రజా ప్రభుత్వం కొనసాగింది. కాగా, 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ను రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తారా? కల్పిస్తే ఎప్పుడు అన్న విషయాలలో క్లారిటీ లేదు.
ఇప్పుడు ఎన్నికలు కూడా సుప్రీం కోర్టు ఆదేశాల కారణంగానే జరుగుతున్నాయి. ఈ నెల 30లోగా శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు సుప్రీంకోర్టు గడువును నిర్ణయించడంతో అనివార్యంగా ఎన్నికల నిర్వహణకు సీఈసీ సిద్ధమైంది. వాస్తవానికి 2019 ఆగస్టు నుంచి ఈ ప్రాంతానికి అధికారాలు కుదించేశారు. ఇప్పుడు ఇది కేంద్రపాలిత ప్రాంతం అయినందువల్ల అధికారాలన్నీ కేంద్రం చేతిలోనే ఉన్నాయి. ఏది ఏమైనా, కాశ్మీర్‌లోని రాజకీయ పక్షాలు ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఎన్నికల్లో పాల్గొనడం మాత్రం నిస్సందేహంగా ప్రజాస్వామ్యానికి మేలు జరిగే అంశమే. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలైన పి.డి.పి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్.సి)లు ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదార్లుగా ప్రచారాన్ని చేపట్టాయి. కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ ప్రారంభించిన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కొందరు మాజీ ఉగ్రవాదులు, నిషేధిత సంస్థల సభ్యులతో సహా పలువురు ఇండిపెండెంట్లుగా ఎన్నికల బరిలో నిలిచారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఏ పార్టీ, ఏ సంస్థా ఎన్నికల బహిష్కరణకు పిలుపు నివ్వలేదు.
ఇక ఇండియా కూటమిలో భాగస్వాములైన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ సీట్ల పంపకం విషయంలో ఒప్పందానికి వచ్చాయి. ఇక బీజేపీ, ప్రొగ్రసివ్ డెమొక్రటిక్ పార్టీలు ఒంటరిగానే రంగంలోకి దిగాయి. మొత్తం మీద రాష్ట్రంలో త్రిముఖ పోరు హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘానికి కత్తిమీద సామే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఇక్కడ ఉగ్రవాదం, వేర్పాటువాదం సీరియస్ సమస్యలుగానే ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, ప్రొగ్రసివ్ డెమొక్రటిక్ పార్టీలు ఇప్పటికీ పాకిస్థాన్ అనుకూల వైఖరినే అవలంబిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలకూ జమ్మూ, కాశ్మీర్ లను అభివృద్ధి మీద పెద్దగా శ్రద్ధ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయలబ్ధి కోసమే ఇండియా కూటమిలో చేరాయని ఆ పార్టీలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. నిజంగా కాశ్మీర్ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నది బీజేపీయే అంటూ ఆ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఊదరగొట్టేస్తోంది. మొత్తం మీద జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది.