Leading News Portal in Telugu

కేసీఆర్ కనబడుట లేదు! | kcr missing| missing kcr


posted on Sep 4, 2024 6:12PM

అధికారంలో వున్న పదేళ్ళు రాచరికం చెలాయించిన కేసీఆర్ అధికారం పోయిన తర్వాత జనంలోకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయిపోయారు. ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ జనం సమస్యల్ని పట్టించుకోకుండా ఇలా అజ్ఞాతవాసం చేస్తున్నారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని, మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలా అని ఆలోచిస్తున్నారు. మామూలు రోజుల్లో జనంలోకి రావడం లేదు సరే.. కనీసం వరదల సమయంలో అయినా జనంలోకి వచ్చి పరామర్శించాలన్న కనీస బాధ్యత కూడా లేకుండా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. అందుకే కేసీఆర్ ‘కనబడుట లేదు’.. అంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. ‘‘రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్’’ అని పోస్టర్‌పై రాసుకొచ్చారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఎన్నడూ చూడని వరదల అల్లకల్లోలాన్ని చవిచూసింది. అయినప్పటికీ కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళలేదు. సరే, వెళ్ళకపోతే వెళ్ళకపోయారు.. కనీసం ‘అయ్యో వరదలు వచ్చాయా’ అనే మాట కూడా కేసీఆర్ వైపు నుంచి రాలేదు. కనీసం సోషల్ మీడియాలోనైనా ఒక ప్రకటన విడుదల చేయలేదు. అందుకేనేమో ‘కేసీఆర్ కనబడుట లేదు’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు ఎవరు అతికించారనే విషయం తెలియరాలేదు. కానీ, కేసీఆర్ వైఖరి మాత్రం చర్చనీయాంశంగా మారింది.