posted on Sep 5, 2024 12:28PM
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో సెప్టెంబర్ మూడోతేదీ జరిగిన ఎన్ కౌంటర్ లో అగ్రనేత నేలకొరిగారు. ఈయన పేరు చెబితే తెలుగురాష్ట్రాలే కాదు చత్తీస్ గడ్ పోలీసుల గుండెల్లో రైలు పరుగెడతాయి. తెలంగాణ హన్మకొండకు చెందిన కరడుగట్టిన నక్సలైట్ జగన్ మృత్యువాత పడటం సానుభూతిపరులను ఆవేదన కల్గించింది. మంగళవారం చత్తీస్గడ్ బీజాపూర్ బస్తర్ జిల్లాల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో జగన్ దుర్మరణం చెందారు. జగన్ పేరు వింటేనే మూడు రాష్ట్రాల పోలీసులు వణికి పోతారు. అటువంటి జగన్ నేలకొరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. హన్మకొండజిల్లా కాజిపేటమండలం టేకులగూడెం గ్రామానికి చెందిన జగన్ 35 ఏళ్ల క్రితం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడైన జగన్ అసలు పేరు మాచర్ల ఏసోబు ఎలియాస్ రణదేవ్ దాదా. ఆర్గనైజర్, కమాండర్ గా పని చేసిన జగన్ అంచెలంచెలుగా ఎదిగారు. చత్తీస్ గడ్ అడవుల నుంచి జగన్ మృత దేహం స్వగ్రామానికి చేరుకుంది.