చంద్రబాబు చేసినపని జగన్ చేయగలరా.. వైసీపీ ఖతమైనట్లే! | cbn dont tolarate misbehaving with women| mla adimulam| suspended| jagn| never| action| leaders
posted on Sep 6, 2024 6:32AM
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నిఖార్సైన రాజకీయాలకు పెట్టింది పేరు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన పద్దతి కలిగిన, ప్రజలు మెచ్చే రాజకీయాలే చేస్తారు. అలా రాజకీయాలు చేసే నేతలకే చంద్రబాబు వద్ద ప్రాధాన్యత ఉంటుంది. గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా వంటి నేతలు తెలుగుదేశంలో సుదీర్ఘకాలం పని చేశారు. ఆ సమయంలో ప్రజలకు అండగా నిలుస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలు చేసే సమయంలోనూ ఆచితూచి మాట్లాడేవారు. కానీ, వారు వైసీపీలో చేరిన తరువాత పూర్తిగా మారిపోయారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, తెలుగుదేశం నేతలపై విమర్శలు చేసే సమయంలో అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారు. వైసీపీ అధికారంలో కొనసాగిన ఐదేళ్ల కాలంలో కొడాలి నాని, రోజా అసెంబ్లీలో, మీడియా ముందు మాట్లాడిన తీరును చూసి ప్రజలు ఛీదరించుకున్నారు. వారు మీడియా ముందు మాట్లాడిన సందర్భాల్లో ఇంట్లో పిల్లలు వినకుండా పెద్దలు టీవీలు బంద్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా, జగన్ మోహన్ రెడ్డి వారిని ప్రోత్సహిస్తూ వచ్చారు.
అదే చంద్రబాబు అయితే.. వారిని పార్టీ నుంచి నిర్దాక్షిణ్యంగా సస్సెండ్ చేసేవారు. ముఖ్యంగా మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా, వారి పట్ల అవమానకరంగా మాట్లాడినా చంద్రబాబు సహించేవారు కాదు. పలు సందర్భాల్లో ఒకరిద్దరు టీడీపీ నేతలు ఇతర పార్టీల్లోని మహిళా నేతల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం చంద్రబాబు దృష్టికి రావడంతో వారిని పిలిచి మందలించిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు తప్పు చేయరు.. ఎవరినీ చేయనీయరు అన్న పేరు ఉంది. ఈ మాట ఆయనే పలు సందర్భాలలో స్వయంగా చెప్పారు. అయితే వైసీపీ అధినేత జగన్ తీరు ఇందుకు పూర్తి భిన్నం. ఆయన తప్పులు చేస్తారు. తప్పులు చేసే వారినే ప్రోత్సహిస్తారు. ఇందుకు ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో జగన్ వ్యవహరించిన తీరే తార్కాణం.
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు హద్దులుమీరి ప్రవర్తించారు. అవినీతి, అక్రమాలు, ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులతోపాటు అభ్యంతరకర పదజాలంతో విమర్శలు చేశారు. జగన్ ఏనాడూ వారిని పిలిచి మందలించిన దాఖలాలు లేవు. దీంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలు ఓటు ద్వారా వైసీపీ నేతలకు గట్టి గుణపాఠం చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి ప్రధాన కారణాల్లో.. కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, జోగి రమేశ్ వంటి నేతల మాటతీరేనని వైసీపీ శ్రేణులు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం శ్రేణులకు చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎవరూ హద్దులు మీరి ప్రవర్తించవద్దని, అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించొద్దని, మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తించవద్దని సూచించారు. దీంతో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినా.. తెలుగుదేశం నేతలు అధికార దర్పాన్ని ఎక్కడా ప్రదర్శించడం లేదు.
తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలుగుదేశం మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు మహిళ, ఆమె భర్త మీడియా సమావేశం పెట్టి ఇందుకు సంబంధించిన వీడియోను బహిర్గతం చేశారు. దీంతో ఆదిమూలంను హైకమాండ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల పార్టీ శ్రేణుల్లో ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తరహాలోనే వైసీపీలోని నేతల పట్ల జగన్ వ్యవహరించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
చంద్రబాబు తరహాలో వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీ ఖాళీ అవుతుందన్న సెటైర్లు సోషల్ మీడి యాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ అధికారంలోఉన్న సమయంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌రావు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తో పాటు అనేక మందిపై మహిళలతో అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, అనంతబాబుల వ్యవహారాలకు సంబంధించి వీడియోలు వైరల్ అయ్యాయి. అయినా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వీటిపై స్పందించలేదు. కనీసం పార్టీ పరంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోతున్న వైసీపీ నేతలు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నిర్ణయంతో జగన్ తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతల అసభ్యకర వీడియోలు బయటకు వచ్చినా జగన్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తరహాలో జగన్ నిర్ణయం తీసుకుంటే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.