Leading News Portal in Telugu

నందిగం సురేష్ ను సానుభూతి కోసం సొంత పార్టీ నేతనే పట్టించేశారా? | nandigam suresh arrested with information from ycp| sajjala| sympathy| political


posted on Sep 6, 2024 10:19AM

ఆకలి తీర్చుకోవడానికి పాము తన పిల్లలను తానే తినేస్తుందంటారు. అలా వైసీపీ కూడావైసీపీ కూడా పాములాగే  రాజకీయ లబ్ధి కోసం సొంత పార్టీ నేతలనే పట్టించేస్తుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పరారీలో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేయడానికి ఆ పార్టీ కీలక నేత, అధికారంలో ఉన్న సమయంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా లీకైన సమాచారమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్టు కావడానికి వైసీపీ కీలక నేత లీక్ చేసిన సమాచారమే కారణమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మాజీ మంత్రి, ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా అదే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మొత్తం 14 మంది నిందితులు ఉండగా పోలీసులు ఇప్పటి వరకూ ఇద్దరిని అదుపులోనికి తీసుకున్నారు. వారిలో ఒకరు మాజీ ఎంపీ నందిగం సురేష్. మిగిలిన నిందితుల్లాగానే ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించగానే నందిగం సురేష్ కూడా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఆయన ఒక్కరి కోసమే కాదు.. ఈ కేసులో నిందితులైన దేవినేని అవినాష్, తలశిల తదితరులు కూడా తమ ఫోన్లు ఆఫ్ చేసి అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.

అయితే వీరందరిలో నందిగం సురేష్ ఆచూకీని మాత్రమే పోలీసులు కనిపెట్టగలిగారు. ఆయన హైదరాబాద్ వెళ్లారు, అక్కడ నుంచీ కూడా మరో ప్రదేశానికి పారిపోయే ప్రయత్నంలో ఉండగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పోలీసులు ఛేజ్ చేసి పట్టుకుని మరీ మంగళగిరికి తరలించారు. ఆ తరువాత కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అది సరే అసలు నందిగం సురేష్ ఆచూకీ అంత కచ్చితంగా పోలీసులకు లీక్ చేసింది ఎవరు అంటే సజ్జల అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఆ పార్టీ మాజీ నాయకుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి నందిగం కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు లీక్ చేశారని డొక్కా అంటున్నారు. ఈ కేసులో నందిగం సురేష్ సమాచారాన్ని మాత్రమే పార్టీ ఎందుకు లీక్ చేసి అరెస్టయ్యేలా చేసింది. మిగిలిన వారిని ఎందుకు కాపాడుకుంటోంది? అంటే నందిగం సురేష్ దళితుడు కావడమే కారణమని అంటున్నారు.   దళిత సామాజిక వర్గానికి చెందిన నందిగం అరెస్టును తమకు అనుకూలంగా మలచుకుని ప్రజలలో సానుభూతి పొందాలన్నదే వైసీపీ వ్యూహంగా ఆయన చెబుతున్నారు.  దళితుడిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసి ప్రజలలో సానుభూతి పొందాలన్న వ్యూహంలో భాగంగానే ఆయన ఆచూకీని పోలీసులకు లీక్ చేశారన్న చర్చ వైసీపీలోనే జరుగుతోంది. ఇటువంటి వికృత రాజకీయాలు వైసీపీ అలవాటేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇందుకు జగన్ సొంతబాబాయ్ హత్య ఘటనను ఉదాహరణగా చూపుతున్నారు.