posted on Sep 10, 2024 12:17PM
గత వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో జోక్యం ఎక్కువై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పుడు చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుంది. ఇందులో భాగంగా గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబుకు పీఎస్ గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాసరావుపై ఉన్న సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై ఉన్న విచారణను సైతం ఆపేశారు. సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు పీఎస్ గా 15 ఏళ్లకు పైగా పెండ్యాల పని చేశారు. వైసీపీ హయాంలో 4 సార్లు ఆయన సీఐడీ విచారణను ఎదుర్కొన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 29న జగన్ ప్రభుత్వం పెండ్యాల శ్రీనివాస్ సస్పెండ్ చేసింది. ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ పై ఉన్న సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆయనను తిరిగి డ్యూటీలో తీసుకుంటున్నట్టు జీవోలో పేర్కొంది. ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఆయనను నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.