Leading News Portal in Telugu

అంచనాలు పెంచుకున్న బాబు.. ఇక కత్తిమీద సాము! | estimations on cbn peaks| people| expectations| very


posted on Sep 10, 2024 12:27PM

చంద్రబాబు పాలనా దక్షత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన రాష్ట్ర రూపురేకలనే మార్చేశారు. జంటనగరాలకు అదనంగా మరో మహానగరాన్ని నిర్మించి, ఐటీ హబ్ గా మార్చారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు తప్ప మరేమీ మిగలని రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రచించారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నాలుగేళ్ల పాటు దేశంలోనే నంబర్ వన్ గా నిలిపారు. ప్రపంచం నలుమూలల నుంచీ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. పరిశ్రమలు తరలి వచ్చాయి. ఐటీలో హైదరాబాద్, బెంగళూరులకు దీటుగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి.

కారణాలేమైతేనేం.. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా అధికార పీఠం ఎక్కారు. అక్కడ నుంచి రాష్ట్రం అన్ని రంగాలలో పతనం కావడం మొదలైంది. పరిశ్రమలు తరలిపోయాయి. పెట్టుబడులు వెనక్కుపోయాయి. అభివృద్ధి పడకేసింది. రోజువారీ ఖర్చులకు కూడా అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి తోడు జగన్ కక్ష సాధింపు రాజకీయాలతో జనం విసిగి వేసారిపోయారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే జైళ్లు నోర్లు తెరిచే పరిస్థితి ఏర్పడింది. ప్రజల బాధలు కష్టాలు పట్టని జగన్ సర్కార్ వారిని వేధింపులకు గురి చేయడంలో మాత్రం అన్ని రికార్డులను అధిగమించేసింది.  జగన్ పాలనలో  బాధలకు గురి కాని వర్గం లేదు. అన్ని వర్గాల ప్రజలూ జగన్ సర్కార్ అరాచక పాలనకు బాధితులుగా మారారు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు పాలనను, ఆ తరువాత ఐదేళ్లు జగన్ పాలననూ చూసిన జనం 2024 ఎన్నికలకు చాలా ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేశారు. వారి నిర్ణయం ఏమిటన్నది ఫలితాలు విస్పష్టంగా తేల్చేశాయి. 

అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం,  ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమ లు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు.. వాటి వ్యయం,  సమాజంలో అసమానతలు, విద్యా, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యత ఇలా ఎన్నో అంశాలలో రెండు ప్రభుత్వాల మధ్య పనితీరును బేరీజు వేసుకొన్న జనం జగన్ పాలనకు చరమగీతం పాడారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అఖండ విజయం సాధించింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగో సారి. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన ప్రతిసారీ తన పని తీరుతో, తన పాలనతో తనపై ప్రజలలో అంచనాలను విపరీతంగా పెంచేశారు.  

ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టి పూర్తిగా మూడు నెలలు కాలేదు.  అప్పుడే జనం గత ఐదేళ్ల జగన్ అధ్వాన పాలన తాలూకు బాధలను మరిచిపోయి.. బంగారు భవిష్యత్ కోసం ఆశగా చంద్రబాబువైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు అన్ని రంగాలలోనూ అవ్యవస్థ, అస్తవ్యస్థ పరిస్థితులను చక్కదిద్దిగాడిలో పెడుతున్నారు. ఆ సమయంలో అనూహ్యంగా భారీ వరదలు వచ్చాయి. బెజవాడ నగరం సగం మునిగిపోయింది. ఆ విపత్కర పరిస్థితులను చంద్రబాబు ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంది. బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. సాధారణంగా ఒక విపత్తు సంభవించినప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కొన్ని విమర్శలను ఎదుర్కోకతప్పదు. ముంపు బాధితుల ఆగ్రహానికి గురి కాక తప్పదు. కానీ చంద్రబాబు సర్కార్ పై బాధితుల నుంచి సైతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు చంద్రబాబు బాధితులకు కల్పించిన భరోసా, ఆపత్స మయంలో అండగా ఉండి ఇచ్చిన ధైర్యమే కారణమనడంలో సందేహం లేదు. ముంపు ప్రాంతాల్లో మోకాలు లోతు నీటిలో ప్రయాణించి మరీ ఆయన బాధితులను చేరుకున్నారు. తానున్నానన్న భరోసా ఇచ్చారు. 

చంద్రబాబు వరద బాధితుల సహాయ పునరావాస చర్యలతో సరిపెట్టలేదు. వరద తగ్గిన తరువాత కూడా వారికి అండగా దండగా నిలవాలనుకున్నారు. నిలిచారు. ముంపునకు గురైన గృహాలను ఫైరింజన్ల ద్వారా శుభ్రం చేయించారు. ముంపు ప్రాంతాలలో పాడైపోయిన వాహనాలు, టీవీలు, ఫ్రిజ్లు వంటి వాటి మరమ్మతులకు ఆయా కంపెనీలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించి అవసరమైన సాయం సత్వరమే అందేలా చేశారు.  చేస్తున్నారు. ముంపు గృహాలలో పాడైపోయిన ఆయా కంపెనీల ఉత్పత్తులకు ఉచితంగా మరమ్మతులు చేసేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయంటే అందుకు చంద్రబాబు చొరవే కారణం. ఆయన ఒక్క పిలుపుతో తొలుత ఎల్జీ కంపెనీ, ఆ తరువాత ఇతర కంపెనీలు ఉచిత మరమ్మతులకు ముందుకు వచ్చాయి. చంద్రబాబు చొరవే. ఆ మేరకు అది ముంపు బాధితులకు అనూహ్యమైన ఊరటే. వెసులుబాటే. ఇక పలువురు కార్లు, బైక్ మెకానిక్ లు ముంపు ప్రాంతాలలో పాడైపోయిన వాహనాలకు ఉచితంగా లేదా నామమాత్రపు చార్జీలతో మరమ్మతులు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాను పని చేస్తూ, ప్రభుత్వ యంత్రాంగం చేత  పని చేయిం చడమే కాదు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ, పునరావాస కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా వారిలో స్ఫూర్తి నింపింది చంద్రబాబు నాయకత్వం. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారపొట్టాలు అందించడంతో ప్రభుత్వం బాధ్యత తీరిపోయినట్లు కాదని చంద్రబాబు తన చేతలతో నిరూపించారు. ఇప్పుడు జనాలకు ఆయనపై అంచనాలు ఆకాశం ఎత్తుకు పెరిగిపోయాయి.

రాష్ట్ర ఆర్థిక సంక్షోభం, వ్యవస్థలలో పేరుకుపోయిన అవ్యవస్థ ఇవేమీ జనాలకు పట్టదు. వారి అంచనాలను అందుకునేలా ప్రభుత్వం పని చేయాలి. అందుకే ఇక ప్రజల అంచనాల మేరకు పని చేయడం బాబు సర్కార్ కు ఒక సవాలే.  జగన్ పాలనతో పోలిస్తే బ్రహ్మాండంగా ఉందికదా అని చెప్పి జనాలను ఒప్పించే అవకాశం లేదు. ఎందుకంటే ప్రజల దృష్టిలో  చంద్రబాబు కేవలం రాజకీయనాయకుడు కాదు.. సూపర్ లీడర్. ప్రజా సమస్యలను చిటికెలో పరిష్కరించగలిగిన హీ మ్యాన్. జనం అంచనాలను అందుకోవడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న బిగ్ టాస్క్.!