Leading News Portal in Telugu

కడుపు మండి రెండు రాళ్లేస్తే తప్పేంటి?.. జగన్ షాకింగ్ కామెంట్స్ | what is wrong in petling stones| jagan| shocking| comments| defending| nandigam


posted on Sep 11, 2024 4:22PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. బుధవారం ఆయన ఏపీకి వచ్చింది వరద బాధితులను పరామర్శించడానికి కాదు. వారికి సహాయం అందించడానికి కాదు. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో పరారైపోవడానికి ప్రయత్నించి విఫలమై అరెస్టయిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జైలులో పరామర్శించడానికి. పది రోజులుగా వరద బాధితులు కష్టాల్లో ఉంటే పరామర్శించడానికి ఆయనకు సమయం లేకపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవిశ్రాంతంగా వరద బాధితుల సహాయ, పునరావాస కార్యక్రమాలలో తలమునకలై జనం చెంతన నిలిస్తే.. దాడి కేసులో అరెస్టైన నిందితుడికి మద్దతుగా జగన్ జైలుకెళ్లి పరామర్శించారు. ఇద్దరికీ అదీ తేడా. 

సరే జైల్లో నందిగం సురేష్ ను పరామర్శించి బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం కార్యాలయంపై నందిగం సురేష్ దాడికి పాల్పడ్డాడు నిజమే. అయితే అందులో తప్పేముంది? అని ప్రశ్నించారు. నాటి ఆ దాడికి కారణం తెలుగుదేశం అధికార ప్రతినిథి పఠాభి అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న తనను బోసడీకే అనడమే అని చెప్పుకొచ్చారు. తనను దూషించడంతో కడుపు మండిన జనం   తెలుగుదేశం కార్యాలయంపై రాళ్లేశారని జగన్ అన్నారు.  అందులో తప్పేముందని అమాయకత్వం ప్రదర్శించారు. తనను ప్రేమించే, అభిమానించే వాళ్లకు పఠాభి తనను బోసడీకే అనడం వల్లనే కడుపు మండి దాడికి పాల్పడ్డారని జగన్ చెబుతున్నారు.  

తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పుడు కూడా జగన్  దాదాపు ఇలాగే మాట్లాడారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారం కోల్పోయి కేవలం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ కూడా జగన్ బాధ్యత లేకుండానే వ్యవహరిస్తున్నారని చెప్పాలి.  తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి జరిగి రెండేళ్లు దాటింది. అయితే అప్పట్లో అప్పటికి అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎవరినీ అరె స్టు చేయలేదు. సీసీ ఫుటేజీ ఆధారాలను పరిగణనలోనకి తీసుకోలేదు. పైపెచ్చు అప్పటి పోలీసు బాస్   ఆ దాడిని  భావప్రకటనా స్వేచ్ఛగా అభివర్ణించారు.

అంత అడ్డగోలుగా, అవధులులేని అహంకారంతో ఐదేళ్లు పాలించిన జగన్ కు ప్రజలు ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు. చరిత్రలో ఇంత వరకూ ఎవరికీ ఎదురుకానంతటి ఘోర పరాజయాన్ని అందించారు. అయినా జగన్ లో మార్పు రాలేదు.  నిజానికి ఇలా దాడిని సమర్ధిస్తూ మాట్లాడినందుకు జగన్ పై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. పార్టీ అధినేత స్థాయి వ్యక్తి ఇలా దాడిని సమర్ధిస్తూ మాట్లాడటమంటే పార్టీ శ్రేణులకు హింసాకాండకు దిగమని సంకేతాలిచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. ఇంత నిస్సిగ్గుగా, బాధ్యతా రహితంగా తెలుగుదేశం కార్యాలయంపై దాడిని, దాడికి పాల్పడిన వారినీ వెనకేసుకొస్తున్న జగన్ కు రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసాకాండ గురించి మాట్లాడే నైతిక అర్హత ఇసుమంతైనా లేదు.  ఇలా ఉండగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాష్ లు ఇంకా పోలీసులకు చిక్కకుండా పరారీలోనే ఉన్నారు. వాళ్లు అరెస్టయిన తరువాత కూడా జగన్ వాళ్లని పరామర్శించడానికి జైలుకువెళ్లి ఇవే మాటలు చెబుతారు.  సందేహం లేదు.